సీటు సింపారా?.. అఖిలేశ్‌, మాయాకు అమిత్‌'షా'క్‌ !

Amit Shah Big Gains In The Last 24 Hours Over Mayawati - Sakshi

సాక్షి, లక్నో : ఉప ఎన్నికల్లో బీజేపీపై పై చేయి సాధించామన్న సంతోషం పూర్తిగా అనుభవించకముందే సమాజ్‌వాది పార్టీకి, బహుజన్‌ సమాజ్‌ పార్టీకి కొత్త చిక్కొచ్చి పడింది. తమను ఓటమిపాలు చేసిన ఎస్పీ, బీఎస్పీని వెంటనే దెబ్బకొట్టేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అప్పుడే తెర వెనుకకు వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికలు వేదికగా చేసుకొని వారిద్దరిని దెబ్బకు దెబ్బ కొట్టేందుకు అమిత్‌షా రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాది పార్టీ నిర్వహించిన కీలక సమావేశానికి ఏడుగురు ఎస్పీ నేతలు డుమ్మా కొట్టారు. వీరి గైర్హాజరు వెనుక అమిత్‌షా హస్తం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. నిజంగానే వారు బీజేపీకి అనుకూలంగా మారితే మాత్రం బీఎస్పీ రాజ్యసభ సీటుకు గండిపడటం ఖాయం.

దాదాపు 25 ఏళ్లపాటు కత్తులు దూసుకున్న ఎస్పీ, బీఎస్పీలు ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా చేతులు కలిపి బీజేపీకి ఝలక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ రెండు స్థానాలను కూడా బీఎస్పీ సాయంతో ఎస్పీ తన ఖాతాలో వేసుకొని సంబరాల్లో మునిగింది. గత నాలుగేళ్లలో బీజేపీకి అతి పెద్ద ఓటమి కూడా ఇదే. కర్ణాటక ఎన్నికల ముందు తమను దెబ్బ కొట్టిన ఎస్పీ, బీఎస్పీపై అమిత్‌షా గుర్రుగా ఉన్నారట.

త్వరలో ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో అభ్యర్థికి కనీసం 37మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో తమకు 311 సీట్లు ఉన్న నేపథ్యంలో కనీసం 8 సీట్లు గెలుస్తామని బీజేపీ ధీమాతో ఉంది. ఇక ఎస్పీకి 47 సీట్లు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి ఒక ఎంపీ సీటు ఖాయం. అయితే, తమ వద్ద అదనంగా ఉన్న 10మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉప ఎన్నికల్లో సాయం చేసిన బీఎస్పీకి ఇవ్వాలని ఎస్పీ నిర్ణయించుకుంది.

బీఎస్పీకి ఇప్పటికే 19మంది ఎమ్మెల్యేలు ఉండగా సమాజ్‌వాది పార్టీ నుంచి 10మంది ఎమ్మెల్యేల మద్దతు, మిగితా మద్దతు అజిత్‌సింగ్‌ పార్టీ నుంచి బీఎస్పీ తెచ్చుకోవాలని భావిస్తోంది. అయితే, అనూహ్యంగా ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు కీలక సమావేశానికి రాలేదు. వీరిలో అఖిలేశ్‌ యాదవ్‌ బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ కూడా ఉన్నారు. అయితే, వీరంతా బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోందట. కానీ, సమాజ్‌ వాది పార్టీ నేతలు మాత్రం ఎన్నికల సమయానికి అంతా సర్దుకుంటుందని, తమ వాళ్లు తమతోనే ఉంటారనే విషయం అప్పుడు తెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top