‘వైఎస్‌ జగన్‌పై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు’

Ambati Rambabu Slams TDP Over Kapu Caste Reservation - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కాపులకి రిజర్వేషన్లు ఎత్తి వేశారని కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద అంబటి రాంబాబు టీడీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. కాపుల రిజర్వేషన్‌పై గత టీడీపీ ప్రభుత్వం మంజునాథ కమిషన్‌ వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించి చేతులు దులుపుకుందని విమర్శించారు. ఈబీసీలకు కేంద్రం ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లను కాపులకు ఇచ్చానని ప్రగల్బాలు పలికారని ఆరోపించారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదని, మేనిఫెస్టోలో చెప్పినదానికి కట్టుబడి ఉన్నామని అంబటి స్పష్టం చేశారు.

అబద్దాన్ని నిజం చేస్తున్నారు
బందర్‌ పోర్ట్‌ తెలంగాణకు అప్పగిస్తున్నారనే వార్తలపై కూడా అంబటి స్పందించారు. ‘ చంద్రబాబు పని ఎలా ఉంది అంటే దున్నపోతు ఈనింది అంటే కట్టేయమని చెప్పండి అన్నట్లుగా ఉంది. బందర్‌ పోర్టు తెలంగాణకి కట్టబెడుతున్నారు అన్న ట్వీట్లు చేస్తున్నారు. బందర్‌ పోర్టు తెలంగాణకి అప్పగిస్తున్నామని అన్న విషయానికి అసెంబ్లీలో మంత్రి సమాధానమిచ్చారు. ఒక అబధ్దాన్ని నిజం అన్నట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టినవి అని తూచా తప్పకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్నాం, బందరు పోర్టు విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో స్నేహపూర్వక మాటలని వక్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అవి మానుకోవాలి. ఏదో పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు’అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. (చదవండి: కాపు రిజర్వేషన్లకు మా మద్దతు ఉంటుంది)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top