యంగ్‌ అండ్‌ డైనమిక్‌ అఖిలేశ్‌ భాయ్‌! | Akhilesh Yadav A Dynamic Leader from Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యంగ్‌ అండ్‌ డైనమిక్‌ అఖిలేశ్‌ భాయ్‌!

Mar 11 2019 2:42 PM | Updated on Mar 15 2019 9:34 PM

Akhilesh Yadav A Dynamic Leader from Uttar Pradesh - Sakshi

సాక్షి వెబ్ ప్రత్యేకం : యూపీ రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్‌ తనయుడిగా పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన అఖిలేశ్‌ యాదవ్‌... ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నాయకుడిగా ఎదిగారు. ఒకానొక సమయంలో తండ్రిపైనే తిరుగుబాటు చేసి.. కుటుంబ పోరులో పైచేయి సాధించి సమాజ్‌వాదీ పార్టీ పగ్గాలు చేజిక్కించుకున్నారు. పిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఈ డైనమిక్‌ లీడర్‌.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎంపీగా రాజకీయ ఓనమాలు దిద్దిన ఎస్పీ కింగ్‌...కేంద్రంలో చక్రం తిప్పడమే ధ్యేయంగా ఒకప్పుడు తమకు బద్ధశత్రువైన బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ‘సిసలైన’ రాజకీయ నేత అనిపించుకుంటున్నారు. మరి ఆయన వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో తెలుసుకోవాలంటే ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు ఆగాల్సిందే!

పర్యావరణ ప్రేమికుడు
ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌- మాలతీ దేవి దంపతులకు జూలై 1, 1973లో ఇటావా జిల్లాలోని సైఫీ గ్రామంలో అఖిలేశ్‌ జన్మించారు. రాజస్తాన్‌లోని ధౌలాపూర్‌ సైనిక్‌ స్కూళ్లో విద్యనభ్యసించారు. అనంతరం మైసూరు యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఎన్విరాన్‌మెంట్‌ విభాగంలో ఇంజనీరింగ్‌ పట్టా పొందారు. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అఖిలేశ్‌... సిడ్నీ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేశారు. రాజకీయాల్లోకి రాకముందే నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు పలు ప్రాజెక్టులపై దృష్టి సారించారు.

రాజకీయ ప్రస్థానం
తన 27వ ఏట అఖిలేశ్‌ యాదవ్‌ రాజకీయ రంగప్రవేశం చేశారు. 2000వ సంవత్సరంలో కనౌజ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక 2009 ఎన్నికల్లో కనౌజ్‌, ఫిరోజాబాద్‌ నియోజకవర్గాల్లో జయభేరి మోగించి అఖిలేశ్‌ కనౌజ్‌ ఎంపీగా కొనసాగారు. ఫిరోజాబాద్‌ స్థానానికి రాజీనామా చేసి అక్కడ తన భార్య డింపుల్‌ యాదవ్‌ను నిలబెట్టగా.. ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఎస్పీ యూత్‌ వింగ్‌కు నాయకత్వం వహించిన అఖిలేశ్‌.. 2009లో యూపీ ఎస్పీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో గూండాగిరీని అంతం చేసి.. విద్యాభివృద్ధి చేస్తామంటూ యువతే లక్ష్యంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు పంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారు.

ఈ క్రమంలో ములాయం, అఖిలేశ్‌ల నాయకత్వంలో 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 403 సీట్లలో 224 స్థానాల్లో ఎస్పీ విజయ బావుటా ఎగురవేసింది. దీంతో ములాయం సింగ్ యాదవ్ తన కొడుకు అఖిలేశ్‌కు సీఎంగా పగ్గాలు అప్పగించారు. తద్వారా అతిపిన్న వయస్సులోనే అఖిలేశ్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.

బాబాయ్‌- అబ్బాయ్‌ల మధ్య వివాదం
2017 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన విషయంలో ములాయం సోదరుడు శివపాల్ యాదవ్, అఖిలేష్ మధ్య వివాదం ప్రారంభమైంది. శివ్‌పాల్ యాదవ్‌ ప్రకటించిన పేర్లను పక్కకు పెట్టి అఖిలేశ్‌ మరికొన్ని పేర్లను సూచించడం పార్టీ చీలికకు దారి తీసింది. ఈ క్రమంలో పార్టీ క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించారన్న కారణంతో అప్పటి ఎస్పీ చీఫ్‌ములాయం సింగ్‌ యాదవ్‌.. అఖిలేశ్‌, ఆయన మద్దతు దారుడు రాంగోపాల్‌ యాదవ్ పై సస్సెన్షన్‌ వేటు వేశారు. పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు. దీంతో ఆగ్రహించిన అఖిలేశ్‌ మద్దతుదారులు అదే ఏడాది జనవరి 1న లక్నోలో ఎస్పీ జాతీయ సదస్సును ఏర్పాటు చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్‌ యాదవ్‌ను ఎన్నుకున్నారు. ములాయంను పదవీచ్యుతుడిని చేశారు. అనంతరం తండ్రీ- కొడుకుల వర్గాలు పార్టీ గుర్తు సైకిల్ కేటాయింపుపై ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో తొలుత పార్టీ గుర్తును స్తంభింపజేయాలని యోచించిన ఈసీ చివరికి అఖిలేష్‌కే పార్టీ గుర్తును కేటాయించి ములాయంకు షాకిచ్చింది.

ఇక 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఒ‍ంటరిగానే 224 సీట్లను గెలుచుకున్న అఖిలేష్‌ యాదవ్‌ పార్టీ సమాజ్‌వాది పార్టీ 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో కలసి పోటీ చేసి కేవలం 54 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ క్రమంలో రాష్ట్రంలో తిరిగి పునర్‌వైభవం పొందేందుకు, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బీఎస్పీ మద్దతు తీసుకున్న అఖిలేశ్‌... ఉప ఎన్నికల్లో గోరఖ్‌పూర్, ఫుల్పూర్‌ లోక్‌సభ స్థానాలకు గెలుచుకున్నారు. ఈ క్రమంలో అఖిలేశ్‌ తన హయాంలో ఇసుక మాఫియాకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై సీబీఐ దాడులు నిర్వహించింది. అయితే ఇలాంటి దాడులకు భయపడేది లేదన్న అఖిలేశ్‌.. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తన సత్తాను చాటుకోవడం ద్వారా రాష్ట్రంలోను తిరిగి పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

కుటుంబం
ఉన్నత చదువులు ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన అఖిలేశ్‌.. అనేక అవరోధాలు అధిగమించి... 1999లో డింపుల్‌ రాజ్‌పుత్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. తొలుత కుమార్తె అదితి తర్వాత కవలలు అర్జున్‌- టీనా జన్మించారు.

ఇష్టాయిష్టాలు
తనను తాను సోషిలిస్టుగా చెప్పుకునే అఖిలేశ్‌ యాదవ్‌కు రామ్‌ మనోహర్‌ లోహియా అంటే అభిమానం.
- యాళ్ల సుష్మారెడ్డి

1
1/6

2
2/6

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement