టీడీపీ పాలనలో అవినీతి శివతాండవం

Ajeya Kallam Comments On TDP Govt - Sakshi

ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం ధ్వజం

ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో అరాచక పర్వం రాజ్యమేలింది.. 

ప్రతి పనిలోనూ 30 నుంచి 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు

బాబు చెప్పే ఐటీ అంతా ఒట్టి భ్రమ.. ఎలక్షన్‌ వ్యవస్థను కుప్పకూల్చారు.. 

ఒక్కో నియోజకవర్గానికి 5 వేల నుంచి 50 వేల ఓట్లు తీసేశారు

పథకం ప్రకారమే మోదీ, కేసీఆర్‌పై చంద్రబాబు ఆరోపణలు

సాక్షి, హైదరాబాద్‌: ‘ఇంత దౌర్భాగ్యమైన పాలన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ చూడలేదు. ఈ ఐదేళ్ల టీడీపీ పాలనలో అన్ని రంగాల్లోనూ అవినీతి శివతాండవం చేసింది. అరాచక పర్వం రాజ్యమేలింది. వ్యవస్థలన్నిటినీ నాశనం చేశారు’అని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) అజేయ కల్లం ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓపెన్‌ మైండ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ‘ఓటు మన హక్కు–ఓటు మన బాధ్యత’అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. విపత్తుల బారినపడి రైతులు అప్పులపాలైనా కూడా చంద్రబాబు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండేళ్లలో వారికి చెల్లించాల్సిన రూ.12 వేల కోట్ల బకాయిలు ఎగ్గొట్టి.. ఎన్నికల ముందు కేవలం వెయ్యి రూపాయలు విదిల్చారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణాన్ని సొంత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మార్చేసుకున్నారని దుయ్యబట్టారు. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం నేర్పింది.. రాజధాని శంకుస్థాపనలు, శిలాఫలకాలకు రూ.350 కోట్లు ఖర్చుపెట్టడమేనా అని చంద్రబాబును ప్రశ్నించారు. అవినీతిని పెంచి పోషించడానికి, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడానికి తప్ప చంద్రబాబు అనుభవం ఎందుకూ ఉపయోగపడలేదన్నారు.  

మీ స్వార్థం కోసం విద్వేషాలు రాజేయొద్దు..
మీ స్వార్థం కోసం రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రాజేయడం రాజకీయ నాయకులకు గానీ సినిమా వాళ్లకు గానీ ధర్మం కాదని అజేయ కల్లం విజ్ఞప్తి చేశారు. ఆంధ్రవాళ్లమంతా హైదరాబాద్‌లో ప్రశాంతంగానే ఉన్నామని చెప్పారు. ఈ కీలక సమయంలో కొందరు రాజకీయ ప్రముఖులు చేసే ఆరోపణలను విశ్వసించవద్దని.. విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. మాట్లాడటం రాని వారు కూడా మంత్రులుగా పాలించటం మన దౌర్భాగ్యమంటూ లోకేశ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  

మాటల్లో చెప్పలేనంత అవినీతి జరిగింది.. 
మనంత అవినీతిలో కూరుపోయిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదని మాజీ సీఎస్‌ అజేయ కల్లం పేర్కొన్నారు. వాటాల కోసం ప్రాజెక్టుల అంచనాల విలువను మూడు రెట్లు పెంచేశారన్నారు. పథకాల్లో, సహజవనరుల్లో, కాంట్రాక్టుల్లో.. మాటల్లో వర్ణించలేనంత దోపిడీ జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతుల భూములను పప్పుబెల్లాల్లా పంచేసిందన్నారు. దీని వెనుకనున్న మతలబేమిటో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరముందన్నారు. రూ.వేల కోట్ల విలువ చేసే 400 ఎకరాల భూమిని ఓ ఎంపీకి అప్పనంగా ఇచ్చారని చెప్పారు. తిరిగి ఆయన నుంచి వచ్చే సొమ్మును ఎన్నికల ఖర్చులకు ఉపయోగిస్తారన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంటే ఖర్చులు నియంత్రించుకోకుండా.. రూ.60 కోట్లు పెట్టి అమరావతిలో తాత్కాలిక భవనాలెందుకని ప్రశ్నించారు. రూ.100 కోట్ల ఖర్చుతో శాశ్వత భవనాలు నిర్మించుకుంటే ప్రజాధనం దుర్వినియోగమయ్యేది కాదన్నారు.  

అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నిత్యం రూ.7.2 కోట్లు.. 
ఉచిత ఇసుక, మట్టి పేరుతో ఏపీలో దోపిడీ తారాస్థాయికి చేరిందని అజేయ కల్లం ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలదే రాజ్యంగా మారిపోయిందన్నారు. ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లు.. ఇలా అన్ని పనులను డబ్బులు తీసుకొని మాత్రమే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఇసుక, మట్టిలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు నిత్యం రూ.7.2 కోట్లు చేరుతుందని చెప్పారు. తెలంగాణలో ఇసుక అమ్మకం ద్వారా రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తే.. మన రాష్ట్రంలో రూ.10 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. కానీ ఒక్క రూపాయి కూడా ఖజానాకు చేరలేదని చెప్పారు. ఇదంతా ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లే తినేస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీలు మితిమీరిన పెత్తనంతో పంచాయతీ వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు.  

సినిమా రాజకీయాలు మంచివి కావు 
సినిమా వాళ్లు వచ్చి రాజకీయాల్లో చేసేదేమీ ఉండదని అజేయ కల్లం పేర్కొన్నారు. వాళ్లకు ఏబీసీడీలు తెలియవన్నారు. ఒకసారి ఎంపీసీ చదివానని, మరోసారి సీఈసీ చదివానంటున్నారని ఎద్దేవా చేశారు. సినిమా రాజకీయాలు రాష్ట్ర భవితకు మంచివి కావన్నారు. రాష్ట్రం కోసం త్యాగం చేసినవారే రియల్‌ హీరోలన్నారు. నేటి యువత అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి గానీ.. ముఖానికి రంగేసుకొని ఎవరో రాసిచ్చిన డైలాగులు చెప్పే వాళ్లను కాదన్నారు.  

వైఎస్సార్‌ వచ్చాకే ఇరిగేషన్‌ అభివృద్ధి.. 
దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే సాగునీరు, విద్యుత్‌ రంగాలు అభివృద్ధి చెందాయని అజేయ కల్లాం పేర్కొన్నారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన జలయజ్ఞానికి చంద్రబాబు రూ.17 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని చెప్పారు. కానీ అలా చేయకుండా.. అవసరం లేని ప్రాజెక్టులు సృష్టించి 35 శాతంపైనా కమీషన్లు వసూలు చేసుకున్నారని ఆరోపించారు. కడపకు చెందిన ఓ రాజ్యసభ సభ్యుడు రూ.3 వేల కోట్ల కమీషన్‌ తీసుకున్నారని చెప్పారు. పోలవరం తదితర ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందన్నారు. ఇక బలహీన వర్గాల ఇళ్ల కాంట్రాక్టుకు సంబంధించి తెలంగాణకు, ఏపీ ప్రభుత్వానికి చదరపు అడుగుకి వెయ్యి రూపాయల తేడా ఉందని చెప్పారు. 36,500 చదరపు అడుగులకు రూ.వెయ్యి చొప్పున లెక్క వేసుకుంటే రూ.వేల కోట్ల అవినీతి జరిగిందనే విషయం స్పష్టమవుతోందన్నారు.

35 ఏళ్లలో జరిగిన అవినీతి కంటే ఈ ఐదేళ్లలో జరిగిన అవినీతే ఎక్కువన్నారు. నీరుచెట్టు, ఎన్‌ఆర్‌జీఎస్‌ ఇలా అన్ని సంక్షేమ పథకాల పేర్లు చెప్పి దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు చెప్పే ఐటీ అంతా ఒట్టి భ్రమ అని అజేయ కల్లం ఎద్దేవా చేశారు. నొయిడాలో, పూణేలో, బెంగళూరులో ఐటీ కంపెనీలు వచ్చినప్పుడు.. అక్కడి వాళ్లెవరూ ఇలా డప్పు కొట్టుకోలేదన్నారు. ఎక్కడ సౌకర్యాలుంటే అక్కడికి ఐటీ కంపెనీలు రావటం సహజమని చెప్పారు. పోలీసులు, రెవెన్యూతో పాటు అన్ని వ్యవస్థలూ టీడీపీ చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలు పొందిన వారితో తామంతా టీడీపీకి కట్టుబడి నడుచుకుంటామంటూ ప్రమాణం చేయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు.  

ఇష్టానుసారంగా ఓట్ల తొలగింపు.. 
40 నియోజకవర్గాల్లో 5 వేల నుంచి 50 వేల ఓట్లు తీసేశారని అజేయ కల్లం ఆరోపించారు. రాష్ట్రం మొత్తం మీద లక్షల సంఖ్యలో ఓట్ల తొలగింపు జరిగిందన్నారు. 40 నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే ఇప్పుడు ఓట్ల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. ప్రతి ఏడాదీ ఓట్ల సంఖ్య పెరగాల్సి ఉంటే.. తగ్గడమేమిటని ప్రశ్నించారు. తిరుపతి నగరంలో 50 వేలు ఓట్లు, నెల్లూరులో 40 వేలు, మంగళగిరిలో 20 వేలు తగ్గాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ ఓట్లను దురుద్దేశంతో తొలగించారని చెప్పారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సి ఓటర్ల డేటా.. టీడీపీ నాయకుల చేతికి వెళ్లిపోయిందన్నారు.

పథకం ప్రకారమే చంద్రబాబు ఆరోపణలు..
ఒక పథకం ప్రకారమే ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని అజేయ కల్లం ఆరోపించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఖర్చులకు.. రాహుల్‌ గాంధీ పర్యటనలకు చంద్రబాబు డబ్బులిస్తున్నారని తెలిపారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే మోదీ, కేసీఆర్‌పై చంద్రబాబు తరచూ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే రాయలసీమ వాసులపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి ప్రస్తుతం రాయలసీమలోనే నేరాలు తక్కువని చెప్పారు. గుంటూరు, కృష్ణా జిల్లాలోనే నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో డేటా స్పష్టం చేస్తోందన్నారు. కానీ క్రైం అంతా రాయలసీమలోనే అన్నట్లు ప్రచారం చేస్తున్నారని అజేయ కల్లం మండిపడ్డారు.

రాయలసీమ వాళ్లు పాలకులయితే భూ ఆక్రమణలు చోటు చేసుకుంటాయని, హత్యలు జరుగుతాయని, ప్రజలకు భద్రత ఉండదంటూ కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని.. అందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరారు. ఏపీ హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్‌ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రులంతా వారం ముందే తమతమ ప్రాంతాలకు వెళ్లి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ఓటు వినియోగించుకునేలా చూడాలన్నారు. చంద్రబాబు ఓటమి చారిత్రక అవసరమన్నారు. సమావేశం సీనియర్‌ జర్నలిస్టు ఎంఈఐ ప్రసాదరెడ్డి, విశ్రాంత ప్రొఫెసర్‌ పి.రాఘవరెడ్డి, ఓపెన్‌ మైండ్‌ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.రాజశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top