
ఇండిగో విమానంలో నినాదాలు చేస్తున్న ఏఐఎఫ్‌బీ అధ్యక్షుడు కె.ఎ. మురుగన్, పార్టీ కార్యకర్తలు
సాక్షి, మధురై: విమానంలో నిరసన చేపట్టారని ఒక పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన ఘటన శనివారం తమిళనాడులోని మధురై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై నుంచి మధురై వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) అధినేత కేఏ మురుగన్ నిరసనకు దిగారు. మధురై విమానాశ్రయ పేరును యు. ముత్తురామలింగ థేవార్‌గా మార్చాలని, మురుగన్‌తోపాటు ఏఐఎఫ్‌బీ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
విమానం మధురై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే, నినాదాలకు దిగిన మురుగన్, ఏఐఎఫ్‌బీ కార్యకర్తలను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ముత్తురామలింగది థేవార్ సామాజికవర్గం. మాజీ పార్లమెంట్ సభ్యుడు ముత్తురామలింగ 1963లో మరణించారు. ఆయనను థేవార్ కులస్థుల ఆరాధ్య నాయకుడిగా చెప్తుంటారు. మధురై విమానాశ్రయ పేరును ముత్తురామలింగ థేవార్‌గా మార్చాలని మురుగన్, తమిళనాడు ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కలసి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. కొద్దిసేపటి తర్వాత మురుగన్‌తో సహా సదరు పార్టీ కార్యకర్తలను పోలీసులు విడిచిపెట్టారు.