రేవంత్‌రెడ్డికి పోసాని హితవు

Actor Posani Krishna Murali Reacts Revanth Reddy Comments On KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సాగుతున్న రాజీకీయ విమర్శలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. లంచం కేసులో పట్టుబడ్డ రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌పై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కేటీఆర్‌ మంచి నాయకుడని, ఆయనపై బురదజల్లడం తగదని హితవు పలికారు. ఆదివారం సాయంత్రం పోసాని మీడియాతో మాట్లాడుతూ..  ‘రెండు మూడు రోజులుగా కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి అనేక విమర్శలు చేస్తున్నారు. ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశిచారు కదా.. మంత్రి  పదవికి రాజీనామా చేయమనడమేంటీ. ఇదెక్కడి లాజిక్కో నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి రూ. 50 లక్షలు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి. అలాంటి వ్యక్తి కేటీఆర్‌ను రాజీనామా చేయమనడమేంటీ. కేటీఆర్, హరీష్ రావు నిజాయితీగల పొలిటీషియన్స్‌. వీళ్లే భవిష్యత్ తెలంగాణకు రెండు కళ్లు.
 

కేటీఆర్ అవినీతిని ప్రతిపక్ష నాయకులు ప్రూవ్ చేస్తే. రేపటి నుంచి టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా తెలంగాణ మొత్తం తిరుగుతా. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని 2 శాతం నేలలు సస్యశ్యామలం అవుతాయి. ఇంత మంచి ప్రాజెక్ట్ కడితే..  కమీషన్ల కోసం అని ప్రతిపక్షాలు విమర్శించడమేంటీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి లాంటి వారు విమర్శించే ముందు ఆలోచించాలి. నాగార్జున సాగర్‌ను కాంగ్రెస్ ప్రజలకోసమే కడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ప్రజల కోసమే కట్టారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నారన్నది మనకు అనవసరం. ప్రజలకు సేవ చేస్తున్నారా లేదా అన్నది ముఖ్యం. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి స్నేహం ఉంది. సమస్యలుంటే కూర్చొని పరిష్కరించుకుంటున్నారు. ఏపీలో ప్రతిపక్షం అసత్యాలతో రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. పోతిరెడ్డిపాడు అంశాన్ని కూడా రెండు రాష్ట్రాల సీఎంలు పరిష్కరించుకుంటారు’అని పోసాని వ్యాఖ్యానించారు.
 

మనోజ్‌ కుటుంబానికి పోసాని సాయం
కరోనా బారినపడి మృతి చెందిన జర్నలిస్టు మనోజ్‌ కుటుంబానికి పోసాని కృష్ణమురళి రూ.25 వేల ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. ‘జర్నలిస్ట్ మనోజ్ మృతి కి చింతిస్తున్నా. నా తరపున రూ. 25 వేల  రూపాయల ఆర్థిక సహాయం చేస్తా. సినిమా షూటింగ్ ప్రారంభమైతే మరో 25 వేలు సహాయం చేస్తా. మీడియా అంటే ప్రజలకు సేవ చేసే రంగం. సినిమా పరిశ్రమ కూడా మనోజ్ కుటుంబానికి సహాయం చేయాలి’అని ఆయన పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top