రూ.5 కోట్లకు చంద్రబాబు ఓకే

Act on fresh evidence in cash-for-vote scam - Sakshi

‘ఓటుకు కోట్లు’వీడియోలో స్టీఫెన్‌సన్‌తో సెబాస్టియన్‌

ఆ రూ. 50 లక్షలు ఇచ్చింది బాబే.. సంచలనం సృష్టిస్తున్న తాజా వీడియో క్లిప్‌

కేసు నమోదైన నాలుగేళ్లకు వెలుగు చూసిన క్లిప్పింగ్‌

11 నిమిషాల నిడివి ఉన్న క్లిప్‌లో కీలక సాక్ష్యాలు

మొదట 3.5 కోట్లు ఇచ్చేందుకు ‘బాబు’సుముఖత

‘బాబు’తో మాట్లాడి డీల్‌ 5కోట్లకు పెంచానన్న సెబాస్టియన్‌

50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే సంభాషణ

తనకు రావాల్సిన కమీషన్‌పై స్టీఫెన్‌సన్‌తో మంతనాలు

‘బాస్‌’డీల్‌ను వ్యక్తిగతంగా అప్పగించారన్న రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘మనవాళ్లు.. బ్రీఫ్డ్‌ మీ, అయామ్‌ విత్‌ యూ బ్రదర్, ఫర్‌ ఎవ్రీ థింగ్‌ అయామ్‌ విత్‌ యూ, వాట్‌ ఆల్‌ దె కమిటెడ్‌.. వి విల్‌ ఆనర్, ఫ్రీలీ యుకెన్‌ డిసైడ్‌.. దట్‌ ఈజ్‌ అవర్‌ కమిట్‌మెంట్‌’ఈ నాలుగు డైలాగులు తెలుగు ప్రజలకు చాలా బాగా పరిచయం. 2015 జూన్‌లో నమోదైన ‘ఓటుకు కోట్లు’కేసులో తెలంగాణ నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌ను ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు ప్రలోభపెట్టారంటూ అప్పట్లో విడుదలైన వీడియోల సారాంశమిది. చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగేళ్ల క్రితం నాటి ఈ ‘ఓటుకు కోట్లు’కుంభకోణంలో.. తాజాగా మరో అత్యంత కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు వెలుగుచూడని తాజా వీడియోతో ఈ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు  వెల్లడయ్యాయి. 11 నిముషాల నిడివి ఉన్న ఈ వీడియోలో తెలంగాణ అసెంబ్లీ నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌ను ప్రలోభ పెట్టేందుకు ఇచ్చిన రూ.50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలున్నాయి. డీల్‌లో భాగంగా ‘బాబు’మొదట రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని.. ఈ కేసులో రెండో ముద్దాయిగా ఉన్న సెబాస్టియన్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు చెప్పారు. అయితే తాను గట్టిగా పట్టుబట్టడం వల్లే ‘బాబు’చివరకు రూ.5 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని.. ఇందులో భాగంగా రూ.50 లక్షలు పంపించారనేది వెల్లడైంది. సెబాస్టియన్‌ చేసిన వ్యాఖ్య ఈ వీడియోలో రికార్డయింది. రూ.50 లక్షల నగదును స్టీఫెన్‌సన్‌ టేబుల్‌ మీద పెట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి వెళ్లిపోయారు. అయితే అక్కడే ఆగిపోయిన సెబాస్టియన్‌ మాత్రం తనకు రావాల్సిన కమిషన్‌ గురించి స్టీఫెన్‌సన్‌తో మంతనాలు జరిపారు. ‘బాబు’తో మధ్యవర్తిత్వం వహించినందుకు తనకు పర్సంటేజీ ఇవ్వాలని స్టీఫెన్‌సన్‌ను కోరాడు. ఈ వీడియో నాలుగో నిముషంలో ‘నోటుకు కోట్లు’సూత్రధారి ఎవరో సెబాస్టియన్‌ వెల్లడించారు.

వీడియోలో ఏముంది?
‘ఈ డీల్‌లో మధ్యవర్తులు కూడా ఉన్నారు. నిజానికి ‘బాబు’మొదట్లో రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్లు మాత్రమే ఇస్తానన్నారు. అయితే నేను పట్టుబట్టడంతో పాటు, డబ్బులు పెంచే విషయంలో బాధ్యతను తీసుకున్నా. ‘బాబు’నన్ను నమ్ముతున్నారు. నువ్వు మాత్రం రేవంత్‌రెడ్డిని విశ్వసిస్తున్నావు. అందుకే అతడిని రంగంలోకి దించాల్సి వచ్చింది’అని డీల్‌లో తన పాత్రను సెబాస్టియన్‌ వివరించారు. ఈ క్లిప్‌లో సెబాస్టియన్, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ‘బాబు’, ‘బాస్‌’గురించి పదే పదే ప్రస్తావించగా.. స్టీఫెన్‌సన్, సెబాస్టియన్‌లకు ‘బాబు’ఎవరో తెలుసనే విషయం స్పష్టమవుతోంది. 11 నిముషాల నిడివి ఉన్న వీడియో క్లిప్‌ ప్రకారం గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఓటు వేస్తే.. మధ్యవర్తుల ద్వారా ఎమ్మెల్యే ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌కు ఇవ్వాల్సిన డబ్బును ‘బాబు’సమకూర్చారు.

వీడియో క్లిప్‌తో గుట్టు రట్టు?
2015 జూన్‌లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్యే కోటా ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేయాలంటూ నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌ను టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రలోభ పెట్టినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇచ్చే క్రమంలో రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరు ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కారు. ప్రలోభాలకు సంబంధించిన తతంగాన్ని ఏసీబీ రహస్య కెమెరాలతో చిత్రీకరించింది. అయితే ఓటుకు కోట్లు కేసు నమోదై నాలుగే«ళ్లవుతున్నా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టేందుకు ఇచ్చిన రూ.50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై చిక్కుముడి వీడటం లేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ), ఇన్‌కంట్యాక్స్‌ (ఐటీ) విభాగాలు, ఏసీబీ ఇదే కోణంలో నాలుగేళ్లుగా విచారణ జరుపుతున్నాయి. ‘ఓటుకు కోట్లు’కేసులో అత్యంత కీలకమైన ఈ వీడియో క్లిప్‌ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ విచారణ ఏజెన్సీకి చిక్కలేదు. 2015లోనే ఏసీబీ ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలతో పాటు, ఓ ఫోన్‌ ద్వారా ఈ వీడియోను చిత్రీకరించారు. నోటుకు ఓటు కేసు విచారణ తాజాగా మరోమారు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో ఫోన్‌ ద్వారా చిత్రీకరించిన ఈ వీడియో క్లిప్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, అతని అనుచరుడు ఉదయ సింహ.. స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన డబ్బు తమది కాదని ఇన్నాళ్లూ విచారణ ఏజెన్సీలకు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగు చూసిన ఈ క్లిప్‌ ‘నోటుకు కోట్లు’కేసు విచారణలో కీలకంగా మారడంతో పాటు, ఈ కేసు కుట్రదారుల గుట్టు బయట పెడుతుందని భావిస్తున్నారు. కాగా స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ఈ వీడియోలో సంభాషణలు సాగాయి.

ఏసీబీ కెమెరాలతో పాటు మరో ఫోన్‌లో!
ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న తార్నాకకు చెందిన మాల్కమ్‌ టేలర్‌ నివాసంలో ఈ వీడియోను చిత్రీకరించారు. డీల్‌ సందర్భంగా ఏసీబీ ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలతో పాటు, మరో ఫోన్‌లో ఈ తతంగం రికార్డయింది. ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డి, మధ్యవర్తి సెబాస్టియన్‌ నడుమ జరిగిన సంప్రదింపులు, సంభాషణ ఈ వీడియోలో ఉన్నాయి. తార్నాకలోని మాల్కమ్‌ టేలర్‌ నివాసంలో ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యింది మొదలుకుని డీల్‌ కుదరడం, నగదు ఇవ్వడం తదితర ఘట్టాలన్నీ ఇందులో ఉన్నాయి. ‘తెలంగాణలో నీకేమైనా జరిగితే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా నామినేట్‌ చేస్తాం. మిగతా అన్ని విషయాల్లోనూ నీ వెంట ఉంటా. మా ‘బాస్‌’ఇది నాకు వ్యక్తిగతంగా అప్పగించిన బాధ్యత. ఈ డీల్‌ కోసం నా తలను పణంగా పెడుతున్నా’అని స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌రెడ్డి చెప్పారు. రేవంత్‌ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ‘నా మొత్తం జీవితాన్నే పణంగా పెడుతున్నా’అని స్టీఫెన్‌సన్‌ సమాధానం ఇవ్వగా, మా ‘బాస్‌’చెప్పిన పని చేస్తున్నా అని రేవంత్‌ సమాధానం ఇచ్చారు. ‘సెబాస్టియన్‌ ద్వారా ఈ రోజు రాత్రికల్లా మొత్తం డబ్బు పంపిస్తా’అని రేవంత్‌ రెడ్డి హామీ ఇవ్వగా.. వెనుక ఓ నల్ల బ్యాగుతో నిల్చున్న వ్యక్తి అందులో నుంచి నగదు నుంచి మధ్యలో ఉన్న టేబుల్‌ మీద పెట్టినట్లు క్లిప్‌ వెల్లడిస్తోంది. కాగా రేవంత్‌రెడ్డిని ఏసీబీ పోలీసులు అరెస్టు చేసే సందర్భంలో ఏసీబీ అధికారులతో రేవంత్‌ వాగ్వాదానికి దిగినట్లుగా క్లిప్‌లో రికార్డయింది. 

‘ఓటుకు నోటు’క్రమమిదీ!
►2015 జూన్‌ మొదటి వారంలో తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్యే కోటాకు ఎన్నికలు జరిగాయి.
►ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డిని బరిలో నిలిపింది.
►పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేలా టీడీపీ డబ్బులు ఎరగా వేసింది.
►అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తన ‘బాస్‌’అప్పగించిన బాధ్యత మేరకు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50లక్షలు ఇస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు.
►వీడియో కెమెరాలతో ప్రలోభాల పర్వాన్ని చిత్రీకరించిన ఏసీబీ రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేయడంతో జైలుకు వెళ్లారు. 
►ఈ కేసు విచారణను తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వయంగా సమీక్షిస్తున్నారు. నాటినుంచీ కేసు అనేక మలుపులూ తిరుగుతోంది.
►ఈ కేసులో రెండో ముద్దాయిగా ఉన్న సెబాస్టియన్‌ అమీర్‌పేట నివాసంపై 2018 సెప్టెంబర్‌లో ఐటీ విభాగం దాడులు చేసింది.
►2018 అక్టోబర్‌లో (రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు) రేవంత్‌రెడ్డి సన్నిహితుడు ఉదయసింహ, సోదరుడు కొండల్‌రెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. 
►2019 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌తోపాటు, ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయసింహ, వేం నరేందర్‌రెడ్డి, అతని కుమారుడిని ఈడీ విచారించింది.
►తాజాగా మార్చి 5, 2019న స్టీఫెన్‌సన్‌తో పాటు, కీలక సాక్షి మాల్కం టేలర్, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top