మోదీ అనుకూల తీర్పులు.. అందుకే రాజ్యసభకు

Abhishek Singhvi Slams BJP For Nomination Of Ranjan Gogoi - Sakshi

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ ఆరోపణ

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ని కేంద్రం రాజ్యసభకు నామినేట్‌ చేయడంపై విపక్ష కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినందుకు గొగోయ్‌ను పెద్దల సంభకు పంపారని విమర్శలు గుప్పిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర​ నేత, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ పలు వ్యాఖ్యలు చేశారు. ‘నాకు మీ రక్తం ఇ‍వ్వండి.. నేను మీకు స్వాతంత్య్రం తీసుకువస్తాను.. అని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ గతంలో పిలుపునిచ్చారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం.. మాకు అనుకూలంగా తీర్పులు ఇవ్వండి. మీకు ఉన్నత పదవులు కట్టబెడతాను అని న్యాయవ్యవస్థను కూడా మేనేజ్‌ చేస్తున్నారు. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తోంది’ అని ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (రాజ్యసభకు మాజీ సీజేఐ)

బీజేపీ సిద్దాంతాలకు లోబడి తీర్పులు ఇచ్చినందుకు గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేశారని అభిషేక్‌ మను సింఘ్వీ అభిప్రాయపడ్డారు.  కాగా  సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది కేటీఎస్‌ తులసి రిటైర్మెంట్‌తో ఖాళీ అయిన స్థానంలో జస్టిస్‌ గొగోయ్‌ని కేంద్ర ప్రభుత్వం నామినేట్‌  చేస్తూ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ న్యాయవాద వృత్తిలో గొగోయ్‌ అనేక సార్లు వార్తలు నిలిచారు. గత ఏడాది నవంబర్‌ 9న సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ప్రకటించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వం వహించి చరిత్రలో నిలిచిపోయారు. (రాఫెల్‌పై మోదీ సర్కారుకు క్లీన్‌చిట్‌)

 రఫేల్‌ ఫైటర్‌ జెట్స్‌ కేసును, శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసును కూడా ఆయన విచారించారు. అయోధ్య కేసులో 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామాలయ నిర్మాణం కోసం వినియోగించాలని ఆయన తీర్పునిచ్చారు. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని మరో ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. సీజేఐగా పదవీకాలంలో లైంగిక వేధింపుల ఆరోపణ సహా పలు వివాదాలను ఆయన ఎదుర్కొన్నారు. రఫేల్‌ ఫైటర్‌ జెట్‌ డీల్‌లో మోదీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన ధర్మాసనానికి కూడా జస్టిస్‌ గొగొయే నేతృత్వం వహించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top