‘50 ఏళ్ల పప్పును పొలిటికల్‌ ప్లేస్కూల్‌కు పంపాలి’

Abbas Naqvi Slams Rahul Gandhi Pappu Should Sent To Political Playschool - Sakshi

రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి నఖ్వి ఘాటు విమర్శలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అసలు పేరు ‘సరెండర్‌ మోదీ’ అని విమర్శించిన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీపై కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖా మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం, రాజకీయ పరిజ్ఞానం లేని 50 ఏళ్ల పప్పును పొలిటికల్‌ ప్లేస్కూల్‌కు పంపాలని ఎద్దేవా చేశారు. అప్పుడైనా దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుస్తుందని విమర్శించారు. కాగా గల్వన్‌ లోయ ప్రాంతంలో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో..‘చైనాతో భారత్‌ బుజ్జగింపు విధానం బట్టబయలు’ అనే శీర్షికతో ఉన్న విదేశీ పత్రిక కథనాన్ని రాహుల్‌ గాంధీ ఆదివారం ట్విటర్‌లో షేర్‌ చేశారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని.. అందుకే మోదీ అసలు పేరు ‘సరెండర్‌ మోదీ’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. (‘చైనా దురాక్రమణకు అవే సాక్ష్యం’)

ఈ విషయంపై స్పందించిన అబ్బాస్‌ నఖ్వీ సోమవారం ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘50 ఏళ్ల పప్పును వాళ్ల కుటుంబం ఇప్పటికైనా పొలిటికల్‌ ప్లేస్కూల్‌కు పంపించాలి. అప్పుడే ఆయన ఫ్వూడలిస్టు విధానాలు, అసంబద్ధమైన భాషకు కళ్లెం పడుతుంది. ఆయనకు అసలు దేశ సంస్కృతి, సంప్రదాయాలు అర్థంకావు. నిరాధారమైన కథనాలు, వదంతులను నమ్ముతూ రాజకీయం చేయాలని చూస్తున్నారు. దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ, నాయకత్వం గురించి విచిత్ర ప్రశ్నలు వేస్తారు. తద్వారా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటారు. రోజంతా ప్రధాన మంత్రిని నిందిస్తూనే ఉంటారు. ఆయన ఉపయోగించే యాస, భాష దేశ రాజకీయాల్లో ఎక్కడా కనిపించదు. ఇప్పటికైనా తన భాషను సరిచేసుకోవాలి’’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక సరిహద్దు వివాదం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అసంబద్ధ వ్యాఖ్యానాలు చేస్తోందని.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉందని పునరుద్ఘాటించారు.  కాగా ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో ఇంగ్లిష్‌ పదం సరెండర్‌ స్పెల్లింగ్‌ను surrenderకు బదులు surender అని రాహుల్‌ గాంధీ పేర్కొనడం గమనార్హం.( ప్రధాని వ్యాఖ్యలకు వక్రభాష్యాలు.. పీఎంవో స్పష్టత!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top