కొరియర్ సర్వీసుల విస్తరణ తర్వాత పోస్టల్ సేవల పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గిన మాట నిజమే. కానీ నేటికీ తపాలా శాఖ సేవలే సామాన్యులకు అందుబాటులో ఉన్నాయనేది తిరుగులేని వాస్తవం
కొరియర్ సర్వీసుల విస్తరణ తర్వాత పోస్టల్ సేవల పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గిన మాట నిజమే. కానీ నేటికీ తపాలా శాఖ సేవలే సామాన్యులకు అందుబాటులో ఉన్నాయనేది తిరుగులేని వాస్తవం. క్రమక్రమంగా కొరియర్ సర్వీసుల నాణ్యత తగ్గి, చార్జీలు మాత్రం విపరీతంగా పెరిగిపోవడంతో ఇటీవలి కాలంలో పలువురు తపాలా శాఖ సేవలపైవే మొగ్గు చూపుతున్నారు. అయితే తపాలా శాఖ వారు అందిస్తున్న స్టేష నరీలో నాణ్యత కొరవడుతోంది. ఇన్‌ల్యాండ్ లెటర్‌కు వాడే కాగితం మరీ పలచబడి పోయి, రాసేవారికి ఇబ్బందికరంగా మారింది. ఎన్వలప్ కవర్ల పరిస్థితీ అంతే.
చేరాల్సిన చోటికి చేరే సరికే చిరిగిపోతున్నాయి. ఒక్క పోస్టు కార్డు మాత్రం పాత నాణ్యతను నిలబెట్టుకుంటోంది. కవర్లపై అంటించాల్సిన పోస్టల్ స్టాంపులకు వెనుక ఉండాల్సిన జిగురు చాలా నాసి రకంగా ఉంటోంది. ఎంత కొత్త స్టాంపులైనా అంటుకోవడం లేదు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో కొరియర్ సర్వీసుల పట్ల మోజు తగ్గి తిరిగి పోస్టల్ సర్వీసులవైపు దృష్టి సారిస్తున్నారు. కాబట్టి తపాలాశాఖ, తాము అందిస్తున్న సామగ్రి నాణ్యతపై దృష్టిని కేంద్రీకరించాలి. తద్వారా పోస్టల్ శాఖ పూర్వ ప్రాభవాన్ని సం పాదించుకోగలుగుతుంది.
- గూరుడు అశోక్ గోదూర్, కరీంనగర్ జిల్లా