ఎన్ని జన్మలు కావాలి? | Sakshi
Sakshi News home page

ఎన్ని జన్మలు కావాలి?

Published Sun, Aug 3 2014 1:16 AM

ఎన్ని జన్మలు కావాలి? - Sakshi

సోనియాగాంధీకి ఒకప్పుడు సన్నిహితుడైన నట్వర్‌సింగ్ ఆమె వ్యక్తిత్వం గురించి, యూపీఏ హయాంలో ఆమె చేసిన అధికార వినియోగం లేదా దుర్వినియోగం గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తారు. సోనియా దాచి ఉంచాల్సింది ఏమైనా ఉందా? అనేదే కేంద్ర సమస్య. ‘అవును’ లేదా ‘కాదు’ అనే సరళమైన ఓ చిన్న సమాధానం చెబితే చాలు.
 
 ఒక్క వాక్యంలో చెప్పగలిగేదానికి పెద్ద పుస్తకం రాయడం అవసరమా? సోనియాగాంధీ తన జ్ఞాపకాలను గ్రంథస్తం చేయాల్సి ఉండటానికి ప్రశస్తమైన కారణాలెన్నో ఉన్నాయి. కున్వర్ నట్వర్‌సింగ్ రాసిన  ‘ఒక్క జన్మ చాలదు’ ఆత్మకథ మాత్రమే అందుకు కారణంగా సరిపోదు. నేడు సోనియా పాలిటి శాపంగా మారిన నట్వర్‌సింగ్ ఒకప్పుడు ఆమెకు ‘సన్నిహిత మిత్రుడు.’ సోనియా గాంధీ వ్యక్తిత్వం గురించి, యూపీఏ అధికారంలో ఉన్న 2004-2014 దశాబ్దంలో ఆమె అధికార వినియోగం లేదా దుర్వినియోగం గురించి ఆయన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తారు. ఆయన వెల్లడించిన విషయాలు, చేసిన వ్యాఖ్యలు విశ్వసనీయమైనవిగా అనిపిస్తున్నాయి. కాబట్టే మీడియాలోనూ, ప్రజల్లోనూ అవి కొంత కాక పుట్టించ గలుగుతున్నాయి.
 
  అందువల్ల ఆ ప్రశ్నలకు ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత కాదు, ఇప్పుడే సోనియా గాంధీ సమాధానం చెప్పాలి. సోనియా దాచి ఉంచాల్సింది ఏమైనా ఉందా? అనేదే కేంద్ర సమస్య. ‘అవును’ లేదా ‘కాదు’ అనే సరళమైన ఓ చిన్న పదంతో సమాధానం చెబితే సరిపోతుంది. సోనియా దాచుకోవాల్సిందేమీ లేకపోతే... ఆమె, ఆమె కూతురు ప్రియాంకాగాంధీ మే నెలలో నట్వర్‌సింగ్‌ను కలసి ఆ పుస్తకంలోని కొన్ని భాగాలను తొలగించాలని ఎందుకు ప్రాధేయపడాల్సి వచ్చినట్టు? తన ఒకప్పటి సహచరుడు, సలహాదారు, మిత్రుడు కట్టుకథలను కల్పించారనుకుంటే అందుకు అత్యంత సమర్థవంతమైన తరుణోపాయం ఆమెకుంది. ఆ రచయితపైనా, ప్రచురణకర్తలపైనా పరువు నష్టం దావా వేయవచ్చు. గెలిస్తే భారీగా పరిహారాన్ని కోరవచ్చు. ఆమె తరఫున కోర్టుకు హాజరుకావడానికి పార్టీ పరివారంలో కావాల్సినంత మంది లాయర్లున్నారు. గంటలోగానే కోర్టు నోటీసు పంపవచ్చు.
 
 కాంగ్రెస్ ప్రతిస్పందన ఇంతవరకు జనాంతికంగా గుంజాటనపడటానికి లేదా బహిరంగంగా రంకెలేయడానికి మధ్య తారట్లాడుతోంది. టీవీ ముందుకు వచ్చే నిస్సహాయులైన కాంగ్రెస్ అధికారిక ప్రతినిధులు తీవ్ర స్థాయి స్వరాలతో విషయాన్ని దారి మళ్లించే క్రీడకు పాల్పడుతున్నారు. ఢిల్లీ గురించి అడుగుతుంటే ముంబైపై తీవ్ర దాడికి దిగుతారు. విస్తృతంగా ప్రచారం సాగినట్టుగా 2004లో సోనియాగాంధీ తమ అంతరాత్మ ప్రబోధం మేరకే ప్రధాన మంత్రి పదవి వద్దనుకున్నారా? లేక ఆమె కుమారునిలోని భయాల వల్ల కాదన్నారా? అని అడిగి చూడండి. సూటిగా సమాధానం చెప్పక పోగా  రచయితపై అంతులేని దూషణలకు దిగుతారు. ఏది ఏమైనా, పులోచ్ ఛటర్జీ అనే ఉన్నత ప్రభుత్వోద్యోగి అధికారిక ఫైళ్లను సోనియాకు చూపిన వైనం ముందు అది వెలవెలబోతుంది. భయపడటం చట్టవిరుద్ధం కాదు. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రం చట్టవిరుద్ధం. సోనియాగాంధీకి ఏ ఫైళ్లను చూపిన సంగతి తనకు తెలియదని మన్మోహన్ సింగ్ ప్రశాంతంగా చెప్పొచ్చు. కానీ ఆయన అలా అంటారా? అనరా? అనకపోతే ఆయన కూడా దోషే అవుతారు.
 
 సోనియా తనను బలిపశువును చేయాలని అనుకోవడం వల్లనే సద్దాం హుస్సేన్ ‘చమురుకు బదులు ఆహారం’ కార్యక్రమంలో ‘‘కాంట్రాక్టేతర లబ్ధిదారుల’’లో ఒకరిగా చేర్చి 2005లో తనను ఉన్నత పదవి నుంచి, తదుపరి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించారని నట్వర్‌సింగ్ ఆరోపించారు. ఆయన అన్నదానిలోని బహువచనం ‘లబ్ధిదారులు’ను గమనించాలి. వారిలో ‘‘ఏఐసీసీ’’ ఉంది. సోనియా, నట్వర్‌సింగ్‌పై చేసినంత తీవ్ర దాడిని ఏఐ సీసీలో మరెవరిపైనా, ఎన్నడూ చేయలేదనడం నిస్సందేహం. ఏఐసీసీలో ఇద మిద్దంగా ఎవరు ఆ పాత్రను నిర్వహించారో కనిపెట్టే ప్రయత్నాన్ని సోనియా గానీ లేదా కాంగ్రెస్ గానీ చేసింది లేదు. తర్వాతి కాలంలో టెలికాం లేదా బొగ్గు అవినీతి కుంభకోణాలు బద్దలైనప్పుడు గానీ లేదా ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా గంతులేస్తూ సంపన్నుడైపోయినప్పుడు గానీ ఆమె అలాంటి తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించలేదు.
 
 నట్వర్‌సింగ్ తన గౌరవానికి విలువనిచ్చే మనిషి. దౌత్య రంగలో ఆయన విశిష్టమైన పదవులను నిర్వహించినవారు. మంచి విషయ పరిజ్ఞానం గల వారు. సోనియా, కుటుంబంలోని మూడు తరాలకు ఆయన సన్నిహితుడు. మే సమావేశంలో సోనియా ఆయన తాను పిల్లలతో సైతం పంచుకోలేని విషయాలను పంచుకోగలిగిన ఆంతరంగికుడని కుమార్తె ప్రియాంకాగాంధీకి చెప్పారు. సోనియా, కాంగ్రెస్‌లు ఆయనను దుష్టునిగానో లేదా కపటిగానో చిత్రించే ప్రయత్నం చేయవచ్చు. కానీ మౌలికమైన ప్రశ్న మాత్రం మాయమై పోదు. ఆయన రాసిన పుస్తకం ఒట్టి చెత్త కుప్పే అయితే, ఆయన ఇంటికి పోయి ప్రాధేయపడటం కోసం ఆమె అంతటి అపారమైన  మానసిక ప్రయాస పడి ఉండేవారేనా?
 
 తన నైతికతను ముక్కలు చెక్కలు చేసి, నిర్దాక్షిణ్యమైన రాజకీయ యంత్రంలో వేసి తోలు వలిచేయడంతో 2005లో నట్వర్‌సింగ్ కుంగిపోయా రనేది స్పష్టమే. అలాంటి గాయాల గుర్తులను తాత్వికత దాచలేదు. అయితే ఆయన సార్వత్రిక ఎన్నికలకు ముందే తన పుస్తకాన్ని ప్రచురించడాన్ని అనుమతించ లేదు. తద్వారా ఆయన సోనియాగాంధీకి, కాంగ్రెస్‌కు గొప్ప మేలు చేశారు. లేకపోతే మరింత ఎక్కువ నష్టం వాటిల్లేది. సోనియాగాంధీ కేవలం కాస్త గడువును సంపాదించుకోవడం కోసం మాత్రమే గాక, నిజంగానే ఆమె వైపు నుంచి తన కథనాన్ని వినిపించదలు చుకుంటే ఓ కరపత్రాన్ని గాక పుస్తకాన్నే తన పేరిట వెలువరిస్తారని ఊహించవచ్చు.
 
 ఒకప్పటి చక్రవర్తులు తమ అధికారిక కథన రచనకు అత్యుత్తములైన మేధావులను  నియమించేవారు. మొఘల్ చక్రవర్తుల తర్వాత భారత్‌ను పరిపాలించిన బ్రిటిష్ రాజ్‌లోని దొరలు, దొరసానులు, దండిగా జ్ఞాపకాలను రచించిన వారు. అది, పదవీ విరమణకు చిట్టచివరి వీడుకోలుకు మధ్యన తప్పక చేయాల్సిన కర్మకాండ. 1947 తర్వాతి వారి వారసులు ‘ఇంగ్లిష్ ఇండియన్లు’ సైతం ఈ రచనా రంగంలో ఏమంత వెనుకబడింది లేదు. అదో గొప్ప వారసత్వం.
 
 అధికారాన్ని రుచి చూసినవారికి తమ చారిత్రక ప్రాధాన్యాన్ని కొలిచేది జ్ఞాపకం కొలబద్ధతోనే అని తెలుసు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో యాల్టా కాన్ఫరెన్స్ జరిగింది. ఆ సందర్భంగా రోజంతా సాగిన క్లిష్టమైన సంప్రదింపుల తదుపరి ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్, జోసెఫ్ స్టాలిన్, విన్‌స్టన్ చర్చిల్ లు విశ్రాంతిగా గడుపుతుండగా... చరిత్ర తమను గురించి ఎలా అంచనా వేస్తుందోనని రూజ్‌వెల్డ్ విస్తుపోయారు. రూజ్‌వెల్డ్ నిరాశావాది, స్టాలిన్ అంతుబట్టనివాడు, చర్చిల్ ఉల్లాసవంతుడు. తనను లిఖించి తన పట్ల చర్చిల్ దయతో ప్రవర్తించాడని చరిత్ర తేల్చి చెప్పింది.
 దానికి తథాస్తు.
 (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)
 ఎంజే అక్బర్

Advertisement
 
Advertisement
 
Advertisement