గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ వరాలజల్లు

Uttam kumar reddy releases Congress party NRI manifesto - Sakshi

అధికారంలోకి వచ్చిన వంద రోజల‌లో సమగ్ర ఎన్‌ఆర్‌ఐ పాలసీ

టీపీసీసీ అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌..

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులలో సమగ్ర ఎన్‌ఆర్‌ఐ పాలసీ ప్రకటిస్తామ‌ని టీపీసీసీ అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇటీవ‌ల ఏఐసీసీ అధ్య‌క్ష‌లు రాహుల్‌ గాంధీ,  కామారెడ్డి సభలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులను, కన్న ఊరును వదిలి కానరాని దేశాలకు తరలివెళ్ళి ఏళ్లతరబడిగా రెక్కలు ముక్కలు చేసుకుంటున్న10 లక్షల మంది తెలంగాణ వలస కార్మికుల కుటుంబాల్లో ఎన్నో ఆవేదనలు, కష్టాలు, కన్నీళ్లు, సంక్షోభాలు ఉన్నాయని పేర్కొన్నారు. అరబ్ గల్ఫ్ దేశాలయిన  సౌదీ అరేబియా, యుఏఇ, ఒమాన్, బహరేన్, కువైట్, ఖతార్ లతో పాటు మలేసియా, సింగపూర్ తదితర దేశాలలో పని చేస్తున్న వలసకార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు.

బొంబాయి - దుబాయి - బొగ్గుబాయి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రవాస భారతీయుల పాత్ర ముఖ్యముగా గల్ఫ్ దేశాలలోని వలసకార్మికుల పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వలస కార్మికులను మర్చిపోయిందని గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో దాదాపు 900 కు పైగా తెలంగాణ వలసజీవులు గల్ఫ్ లో అసువులుబాశారని గల్ఫ్ మృతుల కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని ఆయ‌న విమ‌ర్శించారు. 

నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో వరుసగా నాలుగు బడ్జెట్లలో టీఆర్ఎస్  ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేద‌ని మండిపడ్డారు. ఎంతో ఒత్తిడి తర్వాత ఐదవ బడ్జెట్ 2018-19 ఆర్ధిక సంవత్సరానికి రూ.100 కోట్లు కేటాయించారని, కానీ ఈ డబ్బును ఎలా ఖర్చు చేయాలో నిర్ణయం చేయకుండా, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ బిడ్డలను దారుణంగా మోసం చేసిందని ధ్వజమెత్తారు. 

ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న10 లక్షల మంది తెలంగాణ ప్రవాసీలు ప్రతినెలా 1500 కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం మాతృదేశానికి పంపిస్తూ రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. ఈ విధంగా గల్ఫ్ ఎన్నారైలు తెలంగాణాకు ఏటా రూ. 18 వేల కోట్లు పంపిస్తున్నారని, పరోక్షంగా 5-6 శాతం స్థానిక పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. ఒక వెయ్యి కోట్ల ఆదాయం పొందుతున్నదని తెలిపారు. ఈ నాలుగేళ్లలో తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఎడారిలో ఎర్రటి ఎండలో తమ చెమటను చిందించి పంపిన విదేశీమారక ద్రవ్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని సంపాదించుకున్నదని ఆయన వివ‌రించారు.  

గల్ఫ్ లో ఉన్న రైతులకు రూ. 5 లక్షల బీమా : బతుకుదెరువుకోసం గల్ఫ్ దేశాల బాటపట్టిన సుమారు ఒకలక్ష మంది తెలంగాణ చిన్న, సన్నకారు రైతులకు 'రైతుబంధు' పథకం వర్తింపచేయాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని ఉత్తమ్‌ తెలిపారు. వీరిలో చాలా మంది వ్యవసాయం దెబ్బతిని, బోర్లు తవ్వించి అప్పులపాలై పొట్ట చేతపట్టుకుని గల్ఫ్‌ దేశాలకు వెళ్లినవారేన‌ని, భూమిని నమ్ముకుని బతికిన రైతులు వ్యవసాయం దెబ్బతినడం మూలంగానే విదేశాలకు వెళ్లారని స్వదేశంలో ఉన్న రైతులతో సమానంగా విదేశాలలో ఉన్న రైతులకు ఎల్ఐసి వారి రూ. 5 లక్షల గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ (బృంద జీవిత బీమా) ను వర్తింపచేస్తామ‌ని హామీ ఇచ్చారు. ప్రవాసంలో ఉన్న రైతులకు కూడా అన్నిరకాల 'రైతుబంధు' ప్రయోజనాలు కల్పించడానికి ఒక విధానం రూపొందిస్తామ‌ని, ఎన్నారై రైతుల వ్యవహారాలను చూడటానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న అన్నారు.  

గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ హామీలు :

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో సమగ్ర ఎన్‌ఆర్‌ఐ పాలసీ ప్రకటిస్తాం

► గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధికి ప్రతి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాము.  

గల్ఫ్ లో మృతి చెందిన వలసకార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) చేస్తాము. (గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన ఒక సంవత్సరంలోపు ఇక్కడ మరణించిన వారికి కూడా వర్తింపు) 

గల్ఫ్ కార్మికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము. 

గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వలసకార్మికులకు, ఎన్నారైలకు న్యాయ సహాయం చేస్తాము.   

గల్ఫ్ వలసకార్మికుల పేర్లను రేషన్ కార్డులలో కొనసాగిస్తాము. ఆరోగ్యశ్రీ పథకాన్ని గల్ఫ్ కార్మికులకు వర్తింపజేస్తాము.  

గల్ఫ్ వలసకార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ లతో కూడిన "ప్రవాసీ యోగక్షేమ" అనే పథకాని ప్రవేశపెడతాము.   

ఎన్నారైలు, గల్ఫ్ కార్మికులు స్వదేశానికి వాపస్ వచ్చినంక పునరావాసం, పునరేకీకరణ కొరకు ఆర్ధిక సహాయం చేస్తాము.     

మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి, రిక్రూటింగ్‌ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేస్తాము. అవగాహన సదస్సులు నిర్వహిస్తాము. 

గల్ఫ్ కు వెళ్ళడానికి అవసరమైన 'గమ్కా' మెడికల్ చెకప్ చార్జీలను (రూ.4 నుండి 5 వేలు) ప్రభుత్వం ద్వారా రీయింబర్సుమెంటు చేస్తాము.  

గల్ఫ్ కు ఉద్యోగానికి వెళ్ళడానికి చట్టబద్దంగా రిక్రూటింగ్ ఏజెన్సీలకు చెల్లించాల్సిన సర్వీస్ చార్జీలను, ఇతర ఖర్చులను బ్యాంకుల ద్వారా రుణాల ఇప్పిస్తాము.  

ప్రతి జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఐ విభాగాలను ఏర్పాటు చేస్తాము.

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో వలసలపై అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తాము. 

నేషనల్ అకాడమి ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్)  కేంద్రాలను బలోపేతం చేసి, నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రతి సబ్‌ డివిజన్‌ కేంద్రంలో ఏర్పాటు చేస్తాము. 

కేరళ, పంజాబ్  రాష్ట్రాలు నిర్మాణాత్మకమైన విధి విధానాలతో గల్ఫ్ కార్మికులకు ఆసరాగా ఉంటూ సామాజిక భద్రత కల్పిస్తున్నారు తెలంగాణా ప్రభుత్వం కూడా విస్తృత ఆధ్యయనం  చేసి ఆయా విది విధానాలను
అమలు చేస్తాము. 

ప్రతి ఏటా ప్రవాసి తెలంగాణ దివస్ అధికారికంగా నిర్వహిస్తాము.  

గల్ఫ్‌ దేశాల్లోని  ప్రవాసీ తెలంగాణ సంస్థలను, వ్యక్తులను గుర్తించి, అనుసంధానపరచి ప్రోత్సహించి సమస్యల పరిష్కారంలో వారిని భాగస్వాములను చేస్తాము. 

హైదరాబాద్ లో సౌదీ కాన్సులేట్, యుఏఇ కాన్సులేట్ ల ఏర్పాటుకు ప్రయత్నిస్తాము. 

ఎంబసీలలో తెలుగు అధికారులను నియమించేలా ప్రయత్నిస్తాము.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top