మోసపోయాం : అమెరికాలో తెలుగు విద్యార్థుల గగ్గోలు

Indian Students Seeking Legal Opinion over Immigration Fraud - Sakshi

అడ్మిషన్ తీసుకోమంటూ మరో వర్సిటీ ఒత్తిడి

సాక్షి, టెక్సాస్ : ఆ యూనివర్సిటీ వెబ్ సైట్ చూస్తే ఎంతో నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నట్టు కనిపిస్తుంది. అందులోనూ స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) కరికులమ్ తో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యను అందిస్తామని సైట్ లో పేర్కొన్నారు. పైగా అందులోని ఫోటోలను గమనిస్తే పెద్ద పెద్ద భవనాలతో క్యాంపస్, అత్యాధునిక లైబ్రరీ, విద్యార్థులతో ఫ్యాకల్టీ మధ్య చర్చలు సాగిస్తున్నట్టు... ఎన్నో దృశ్యాలు... అదే ఫార్మింగ్టన్ యూనివర్సిటీ. అలాంటివి చూసే మోసపోయామని మొత్తుకుంటున్నారు.  అడ్మిషన్ పొందిన మన తెలుగు విద్యార్థులు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఐసీఈ) కు చెందిన అండర్ కవర్ ఏజెంట్లు సృష్టించిన ఈ ఫేక్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుని వారి ట్రాప్ లో చిక్కుకున్న విద్యార్థులు ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. 

ఇందులో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఒక్కొక్కరిది ఒక్కో గాధ. తక్షణ కర్తవ్యమేంటో అంతుపట్టక కొట్టుమిట్టాడుతున్నారు. యూనివర్సిటీ గురించి తెలియక ఎంతో డబ్బు ఖర్చుపెట్టి యూనివర్సిటీ ఫీజులు చెల్లించి చేరిన పలువురు విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా మారినట్టు సమాచారం.  ఆటా, నాటా తదితర సంస్థలు వెబినార్ కార్యక్రమం నిర్వహిస్తూ విద్యార్థులకు సూచనలు, సలహాలు అందజేస్తోంది. అక్కడి అటార్నీలతో మాట్లాడిస్తూ వారి సందేహాలను నివృతి చేయించే కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి ఆ సంఘాలు. 

ఆటా తాజాగా రెండో రోజు నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది ఐసీఈ ట్రాప్ లో చిక్కుకున్న పలువురు విద్యార్థులతో పాటు అనేక మంది ఇతర విద్యార్థులు కూడా పాల్గొని అనేక సందేహాలను వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఐసీఈ డిటెన్షన్ నుంచి బయటకు వచ్చిన వారు సైతం అనేక సందేహాలను వ్యక్తం చేశారు. అటార్నీలు వారందరికీ సలహాలు సూచనలు ఇచ్చారు. యూనివర్సిటీ బోగస్ అని, అక్కడ క్లాసులు జరగవని, కేవలం సీపీటీ కోసం చేరిన విద్యార్థులు మాత్రం దేశం విడిచి వెళ్లకతప్పదని తెలుస్తోంది. ఈ ఫేక్ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులందరికీ ప్రస్తుతం ఐసీఈ నోటీసులను అందజేస్తోంది. ఐసీఈ డిటెన్షన్ నుంచి కొందరు ఒక రోజులోనే బయటకురాగా అమెరికాలో కొనసాగిన షెట్ డౌన్ కారణంగా కొన్ని సాంకేతిక సమస్యలతో మరికొద్ది రోజుల పాటు డిటెన్షన్ లో కొనసాగకతప్పదని అంటున్నారు. 

ఏదేమైనా ప్రస్తుత సమస్యల నుంచి బయటపడటం ఎలా? ఉన్న మార్గాలేంటి? ప్రత్యామ్నాయాలేమైనా ఉన్నాయా? ఉంటే ఎలా ముందుకు వెళ్లాలి? వంటి అనేక సందేహాలను విద్యార్థులు అటార్నీలను అడిగి తెలుసుకున్నారని సంఘాల ప్రతినిధులు చెప్పారు. తక్షణం దేశం విడిచి వెళతానని చెప్పేవారు విధిగా బాండ్ తో పాటు కాన్సులేట్ లో సంప్రదించాలి. అలాగే రుజువుగా ఫ్లయిట్ టికెట్ కూడా చూపించాల్సి ఉంటుంది. అమెరికాలో అక్రమంగా గత ఆరు మాసాలుగా ఉన్నట్టు తేలితే అలాంటి వారికి కనీసం 5 సంవత్సరాలపాటు మళ్లీ దేశంలో అడుగుపెట్టకుండా బ్యాన్ విధించే అవకాశాలున్నాయి. అలాగే ఏడాదికిపైగా అక్రమంగా ఉన్నట్టు రుజువైతే కనీసం పదేళ్ల పాటు బ్యాన్ విధించే అవకాశాలున్నాయి. కొందరు విద్యార్థులు మూడవసారి సెవిస్ లో ప్రవేశించిన తర్వాత ఈ వర్సిటీలో అడ్మిషన్ పొందినట్టు తెలుస్తోంది. 

యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న సమయంలో తరగతులు జరగవన్న సంగతి తెలియదని, ఆ తర్వాత కాలంలో క్లాసులు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించినా ఎవరి నుంచి సమాధానం రాలేదని ఒక విద్యార్థి తెలుపగా, అలాంటి సందర్భాల్లో యూనివర్సిటీ అధికారులతో కరస్పాండెన్స్ జరిపినట్టు రుజువులు ఉన్నట్టయితే వాటి ఆధారంగా కోర్టులో సవాలు చేయొచ్చని తెలిపారు. ఫోన్ కన్వర్సేషన్స్, ఈ మెయిల్ కరస్పాండెన్స్, లెటర్స్ రాయడం వంటి ఎలాంటి ఆధారాలున్నా ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించి రిలీఫ్ పొందడానికి ఆస్కారం ఉంది. అడ్మిషన్ పొందినప్పుడు క్లాసులు నిర్వహించరన్న విషయం తెలియకపోయినా, ఆ తర్వాత కాలంలో మీ తరఫున జరిగిన ప్రయత్నాలు, వాటికి ఉన్న ఆధారాలే కీలకమని అటార్నీలు వివరించారు. సీపీటీ కోసం కాకుండా కేవలం ఉన్నత విద్యను అభ్యసించడానికే యూనివర్సిటీలో చేరినట్టు రుజువు చేసుకోగలిగినా, లేదా క్లాసులు జరగడం లేదన్న కారణంగా మధ్యలో యూనివర్సిటీని వదలివెళ్లినా అమెరికాలో ఉండటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రస్తుత చర్యను చట్టపరంగా కోర్టులో సవాలు చేసుకోవడానికి ఆస్కారం ఉందని తెలిపారు. 

2016 లో యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ (యూఎన్ఎన్జే) పేరుతో ఇలాంటి స్టింగ్ ఆఫరేషన్ నిర్వహించినప్పుడు కూడా అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు అమెరికా వదిలి సొంత రాష్ట్రాలకు వచ్చేశారు.

మా యూనివర్సిటీలో చేరమంటూ ఒత్తిడి
ఫార్మింగ్టన్ యూనివర్సిటీ వ్యవహారంలో ఇరుక్కుని విద్యార్థులు ప్రస్తుతం నానా ఇబ్బందులు పడుతుండగా, ఆటా నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో పాల్గొన్న ఒక విద్యార్థి ద్వారా మరో యూనివర్సిటీ వ్యవహారం బయటపడింది. క్లాసులు ఉండవు... కాలేజీ ఉండదు... సీపీటీ ఇస్తాం చేరండి అంటూ మిడ్ ఫ్లొరిడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారంటూ ఒక విద్యార్థి అటార్నీల దృష్టి తెచ్చారు. తొలుత ఆ ఇన్ స్టిట్యూట్ లో చేరడానికి వెళ్లానని అయితే అక్కడి పరిస్థితులు గమనించిన తర్వాత వెనక్కి వచ్చానని చెబుతూ, ఆ రోజు నుంచి కాలేజీలో చేరాలంటూ తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే ఆ కాలేజీలో 50 మంది విద్యార్థులు చేరినట్టు చెబుతున్నారు. కాలేజీ ప్రతినిధులు ఎంత ఒత్తిడి తెచ్చినా తాను చేరలేదని, అయితే, ఇప్పుడు కొందరు తెలుగు విద్యార్థులే ఫోన్లు చేసి కాలేజీలో చేరొచ్చనీ, క్లాసులు లేకుండా హాయిగా సీపీటీ ఇస్తున్నప్పుడు ఎందుకు చేరడం లేదంటూ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దాంతో అటార్నీలు ఆవిద్యార్థిని హెచ్చరిస్తూ, కాలేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా సీపీటీ కోసం తొందరపడి  యూనివర్సిటీలను మార్చడం మంచిది కాదని సలహా ఇచ్చారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top