ప్రవాసీల ఆత్మబంధువు

Gulf NRIs Tribute to Sushma Swaraj - Sakshi

విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మాస్వరాజ్‌ విశేష సేవలు ∙

వలస జీవులకు అండగా నిలిచిన ‘చిన్నమ్మ’

రిక్రూటింగ్‌ విధానంలోనూ అనేక మార్పులు

సుష్మకు గల్ఫ్‌ ఎన్నారైల నివాళి

గల్ఫ్‌ డెస్క్‌: పొట్ట చేత పట్టుకుని పొరుగుదేశాలకు వలస వెళ్లిన ప్రవాసులకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ సుష్మాస్వరాజ్‌ అండగా నిలిచారు. విదేశాంగ మంత్రిగా సేవలందించిన సుష్మాస్వరాజ్‌ ఎన్నారైల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ట్విట్టర్‌ ద్వారా తన దృష్టికి వచ్చిన ప్రవాసీల సమస్యలపై వెంటనే స్పందించేవారు. ప్రభుత్వం తరఫున వారిని ఆదుకుని అందరి ఆదరాభిమానాలను చూరగొన్నారు. విదేశాంగ శాఖ మంత్రిగా ప్రవాసీల సంక్షేమం కోసం ఆమె ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు వారికి ఎంతగానో ఉపయోగపడ్డాయని గల్ఫ్‌లోని భారతీయులు అంటున్నారు.

లైసెన్సింగ్‌ విధానంలో మార్పులు..
మన దేశం నుంచి కార్మికులను, ఉద్యోగులను విదేశాలకు ఉపాధికి పంపించేం దుకు గాను రిక్రూటింగ్‌ లైసెన్సింగ్‌ విధానంలో సుష్మాస్వరాజ్‌ పలు మార్పులు తీసుకువచ్చారు. గతంలో లైసెన్సింగ్‌ ఏజెన్సీ బ్యాంకు గ్యారంటీగా రూ.20 లక్షలు పెట్టాల్సి ఉండగా, దానిని రూ.50 లక్షలకు పెంచారు. అయితే, చిన్న ఏజెంట్లకు ఇబ్బందులు తలెత్తడంతో వంద మంది లోపు పంపడానికి రూ.8 లక్షల డిపాజిట్‌ విధానాన్ని అమలు చేశారు.

సమస్యలు చెప్పుకునేందుకు ‘మదద్‌’..  
విదేశాల్లో సమస్యల్లో చిక్కుకున్న భారతీయులు తమ సమస్యలను విదేశాంగ శాఖ అధికారులకు తెలుపుకునేందుకు గాను ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించారు. మదద్‌ (కాన్సులార్‌ సర్వీసెస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం –భారత రాయబార కార్యాలయాల్లో దౌత్య సంబంధమైన సేవల పర్యవేక్షణ వ్యవస్థ) ద్వారా ఎక్కడ ఎవరు ఏ సమస్య ఉన్నా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే వెంటనే విదేశాంగ శాఖ స్పందిస్తుంది. ఈ వ్యవస్థకు హిందీలో ‘మదద్‌’ అని పేరు పెట్టారు. గతంలో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సమస్యలు చెప్పుకోవడం, వాటికి రిప్లై రాయడం నెలల తరబడిగా కొనసాగేది. ఆన్‌లైన్‌ ఫిర్యాదులతో సమస్యను క్షణాల్లో చెప్పుకునే అవకాశం ఏర్పడింది. ఇలా సుష్మాస్వరాజ్‌  ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారు.

ట్విట్టర్‌ ద్వారా స్పందన
విదేశాల్లో ఉన్న ప్రవాసీలు ఎవరైనా ఇబ్బం దులు ఎదుర్కొన్నట్లయితే వారు నేరుగా తమ సమస్యను అప్పట్లో నేరుగా మంత్రి సుష్మాస్వరాజ్‌కు చెప్పుకునేందుకు ట్విట్టర్‌ అకౌంట్‌ను అందుబాటులో ఉంచారు. తమ సమస్యను ట్విట్టర్‌ ద్వారా చెప్పుకుంటే చాలు.. వెంటనే సమస్య పరిష్కారానికి విదేశాంగ శాఖ రంగంలోకి దిగేది. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. క్రమం తప్పకుండా ట్విట్టర్‌లో వచ్చే వినతులను ఆమె పరిశీలించేవారు.   

గల్ఫ్‌ కార్మికులకు అండగా...
2014 నుంచి 2019 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన సుష్మాస్వరాజ్‌ గల్ఫ్‌ దేశాల్లోని ప్రవాస భారతీయులకు సహా యం అందించారు. కేంద్ర మంత్రి హోదా లో గల్ఫ్‌ దేశాల్లో పర్యటించిన సందర్భాల్లో ఆమె వలస కార్మికుల కష్టాలను తెలుసుకున్నారు. 2016లో సౌదీలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి పలు కంపెనీలు మూతబడ్డాయి. ఫలితంగా కార్మికులు రోడ్డున పడ్డారు. దీంతో సుష్మ వెంటనే స్పందించి విదేశాంగ శాఖ అధికారులను రంగంలోకి దింపి మన కార్మికులను ఒక చోటకు చేర్చి వారికి భోజన సదుపాయాలను సమకూర్చడంతో పాటు కార్మికులు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేయించారు. కువైట్, బహ్రెయిన్, యూఏఈ తదితర దేశాల్లో క్షమాభిక్ష అమలు చేసిన సమయంలోనూ కార్మికులకు సహాయమందించారు.  

ప్రభావితం చేసిన విధాన నిర్ణయాలు  
సుష్మాస్వరాజ్‌ హయాంలో ‘కనిష్ట ప్రభుత్వం–గరిష్ట పాలన’ విధానంలో భాగంగా భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్‌ ఓవర్సీస్‌ ఇండియన్‌ అఫైర్స్‌)ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ అఫైర్స్‌)లో విలీనం చేయడం పై మిశ్రమ స్పందనలు ఎదురయ్యాయి. 2003 నుంచి ప్రతిఏటా జనవరి 9న నిర్వహిస్తున్న ‘ప్రవాసీ భారతీయ దివస్‌’ను రెండేళ్లకోసారి నిర్వహించడం విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ విదేశాల్లోని అన్ని భారతీయ రాయబార కార్యాలయాలలో ఈ పండుగను నిర్వహించడం పట్ల ప్రశంసలు అందుకున్నారు.

ఇ–మైగ్రేట్‌ ద్వారా ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌..
భారత కార్మికులను విదేశీ ఉద్యో గాల్లో భర్తీచేయడానికి ఇ–మైగ్రేట్‌ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో యజమానులు, ఉద్యోగులు, రెండు దేశాల ప్రభుత్వాలు, రిక్రూటింగ్‌ ఏజెన్సీలు ఒకే వేదికపైకి వస్తాయి. దీని ద్వారా వేతన ఒప్పందాల రికార్డుల నిర్వహణ, కార్మికుల సంక్షేమం, భద్రత సులువు అవుతుంది.

వేగంగా స్పందించేవారు
వివిధ దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు ఏ చిన్న సమస్య ఎదురైనా  సుష్మాస్వరాజ్‌ వేగంగా స్పందించేవారు. విదేశాల్లో ఆస్పత్రిపాలైన మన కార్మికులను ఎందరినో స్వదేశానికి చేర్చారు. ప్రవాసుల సంరక్షణలో కొత్త శకానికి నాంది పలికారు. 2015లో ఒమాన్‌లో పర్యటించి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.   – రాధ బచ్చు, ఒమాన్‌ (సికింద్రాబాద్‌)

బహ్రెయిన్‌ను మూడుసార్లుసందర్శించారు
సుష్మాస్వరాజ్‌ బహ్రెయిన్‌ను 2014, 2016, 2018 సంవత్సరాల్లో సందర్శించా రు. ఇరుదేశాల మధ్య ఖైదీల బదిలీ, హెల్త్‌ కేర్‌ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇండియన్‌ ఎంబసీ నూతన భవనాన్ని ప్రారంభించారు. తెలంగాణ చిన్నమ్మకు మా నివాళి.  – పడాల రాజేశ్వర్‌గౌడ్, బహ్రెయిన్‌ (ముచుకూర్, నిజామాబాద్‌)  

సౌదీ ‘జనాద్రియా’ పండుగలో పాల్గొన్నారు
సౌదీ అరేబియాలోని రియా ద్‌లో 2018లో జరిగిన సౌదీ జాతీయ వారసత్వ పండుగ ‘జనాద్రియా’లో సుష్మాస్వరాజ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భారతీయులను ఆత్మీయంగా పలకరించారు, ప్రవాసుల సమస్యలను ఆలకించారు.          – అబ్దుల్‌ సాజిద్, సౌదీ (జగిత్యాల)

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top