
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఫెడరల్ రెవిన్యూ మంత్రి కెల్లీ ఓడ్విన్ అధ్యక్షతన లిబరల్ పార్టీ నాయకులు ముత్యాల రాంపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియాలోని వివిధ భారతీయ సంఘాల నాయకులతో జరిపిన ఈ వేడుకలలో ముఖ్య అతిథులుగా టీఆర్‌ఎస్ కో ఆర్డినేటర్ ఎన్‌ఆర్ఐ మహేష్ బిగాల, టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఆస్ట్రేలియాలో కూడా విస్తరిస్తూ, మన పండగలను ప్రతీ సంవత్సరం అట్టహాసంగా జరుపుతున్న లిబరల్ పార్టీ నాయకుడు ముత్యాల రాంపాల్ రెడ్డికి నాగేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
భారతీయులకు ఎంతో ముఖ్యమైన దీపావళి వేడుకలను లిబరల్ పార్టీ తరపున నిర్వహిస్తున్నందుకు రెవిన్యూ మినిస్టర్కి మహేష్ బిగాల అభినందనలు తెలిపారు. అలాగే ఈ వేడుకలలో ఇండియన్ కాన్సుల్ జనరల్ మణిక జైన్, టీఆర్‌ఎస్ మైనారిటీ నాయకులు జమాల్ మొహమ్మద్ తో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.