జీవితంలో ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదు

Worst Nightmare Far From Over People In Relief Camps After Kerala Rain - Sakshi

కన్నీటి సంద్రమైన కేరళ

మరో మూడు రోజులు భారీ వర్షం - వాతావరణ శాఖ

సహాయక శిబిరాల్లో బిక్కుబిక్కుమంటున్న జనం

ఇప్పటికి 30మంది మృత్యువాత

మరింత  ఆందోళన  రేపుతున్న ఇడుక్కి రిజర్వాయర్‌

రేపు హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  ఏరియల్‌ సర్వే

ముఖ్యమంత్రి సహాయ నిధికి విరివిగా విరాళాలివ్వండి!

తిరువనంతపురం : ప్రకృతి బీభత్సానికి గాడ్స్‌ ఓన్‌ కంట్రీ కేరళ  చివురుటాకులా వణికిపోయింది. జీవితంలో ఇంతటి ఘోరమైన పరిస్థితిని చూడలేదని సహాయ శిబిరాల్లో తలదాచుకున్న జనం వాపోతున్నారు. బిక్కు బిక్కుమంటూ  శిబిరాల్లో గడుపుతున్న వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో చేదు అనుభం. డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో వేరే ఇంటికి మారాం...కానీ కొండచరియలు  తమ బంధువులను పొట్టన పెట్టుకున్నాయని, స్థానికులు తన పాపను రక్షించారంటూ అమ్మమ్మ తాతమ్మలను కోల్పోయిన బిబిన్ (23)  కన్నీరుమున్నీరయ్యారు. అయితే సుబేష్అనే స్తానికుడు బిబిన్ భార్య, బిడ్డను రక్షించాడు. తెల్లవారుఝామున మా కుక్క గట్టిగా అరవడం మొదలుపెట్టింది. క్రమంగా ఇది చాలా అసాధారణ దుఃఖంతో హృదయ విదారకంగా మారిపోయింది. దీంతో పరిస్థితి అర్థమై తృటిలో మృత్యువునుంచి తప్పించుకున్నామని మరో బాధితుడు చెప్పారు. 59 ఏళ్ల మనియ‍మ్మది ఇదే అనుభవం. రాత్రంతా కంటిమీద కునుకు లేదు. కొండచరియలు పడుతున్నాయి, భారీ వర్షం, ఇంతలో భయంకరమైన ధ్వనులను వినిపించాయి. అంతే తన పదేళ్ల మనుమరాల్ని తీసుకుని బయటపడ్డానని తెలిపింది.

కేరళలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనం కన్నీటి సంద్రంగా మారారు.  భారీ వర్షాల కారణంగా ఇప్పటికే 30 మంది చనిపోగా అనేక కుటుంబాల్లోని  54వేలమంది నిరాశ్రయులయ్యారు.  రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. అరటి, కొబ్బరి పంటలు నాశనమయ్యాయి. ఇడుక్కి రిజర్వాయర్‌లోని  అతి ప్రమాదకర స్థాయి మరింత ఆందోళన సృష్టిస్తోంది. మరోవైపు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ఎర్నాకులం, పాలక్కడ్, మలప్పురం, కాలికట్లో ఆగస్టు 12వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు, సహాయ కార్యక్రమాలను సత‍్వరమే అందించేందుకు నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, వాయు దళాలతో పాటు స్థానిక పోలీసు, ఇతర పరిపాలనా యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది.
 
ఇడుక్కి మున్నార్‌ రిస్టార్ట్స్‌లో విదేశీయులు చిక్కుకుపోయారు. దాదాపు 54మందిలో సగం మంది ఇక్కడ  ఉండిపోయారు. అయితే నేవీ, వాయు రక్షణ దళం బృందం వారిని  సురక్షిత  ప్రాంతానికి తరలించింది. హెలికాప్టర్ల సాయంతో వారిని రక్షించారు. ఇది ఇలా ఉంటే ఇప్పట్లో కేరళకు  వెళ్లవద్దని అమెరికా హెచ్చరికలు చేసింది.  

కాగా మృతుల కుటుంబాలకు రూ.4లక్షల సహాయం అందిస్తామని  ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఇళ్లు, ఆస్తులు కోల్పోయినవారికి రూ.పది లక్షల పరిహారం ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ ఎత్తున విరాళాల్సిందిగా  కేరళ సీఎం ప్రజలకు విజ్తప్తి చేశారు. మరోవైపు  వరదలతో అతలాకుతలమైన  కేరళను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. వరద పరిస్థితి, అందుతున్న సాయంపై ప్రధానమంత్రి ఇప్పటికే పినరయి విజయన్‌తో మాట్లాడారు. ఇప్పటికే ఒక కేంద్ర బృందం కేరళలో పర్యటించింది. వరద ప్రభావం తెల్సుకునేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ కేరళలో  ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top