మతం మారిందని.. ఆస్తిలో వాటా హుష్!
రెండోసారి పెళ్లి చేసుకునేటప్పుడు మతం మారిందన్న కారణంతో తండ్రి నుంచి వారసత్వంగా రావాల్సిన ఆస్తిని ఇవ్వకపోవడంతో ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది.
రెండోసారి పెళ్లి చేసుకునేటప్పుడు మతం మారిందన్న కారణంతో తండ్రి నుంచి వారసత్వంగా రావాల్సిన ఆస్తిని ఇవ్వకపోవడంతో ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. ఆమె అన్నలిద్దరూ ఆమెను కుటుంబం నుంచి వెలివేయడమే కాక.. వారసత్వ ఆస్తిని కూడా ఇవ్వడానికి నిరాకరించారు. సోనియా తండ్రి 2010లో మరణించారు. ఒక ఏడాది తర్వాత ఆమె భర్త బ్లడ్ కేన్సర్‌తో మరణించాడు. ఆ తర్వాత తమ తండ్రి ఇంటిని సమానంగా పంచుకోవాలని ఆమె అన్నలు నిర్ణయించుకున్నారు. దాన్నుంచి వచ్చే అద్దెను ప్రతినెలా ఇస్తామని సోనియాకు తెలిపారు. తనకు ఏడేళ్ల కూతురు ఉండటం, వేరే జీవనాధారం లేకపోవడంతో అందుకు ఆమె సరేనంది.
తర్వాత 2012లో హసన్ అనే వ్యక్తి పరిచయం కావడంతో అతడితో ప్రేమలో పడింది. ఆమెను మతం మార్చకుండానే పెళ్లి చేసుకోడానికి తన కుటుంబ సభ్యులను హసన్ ఒప్పించాడు. కానీ సోనియా సోదరులు మాత్రం ఆ పెళ్లికి నిరాకరించి, ఆమెను కుటుంబం నుంచి వెలివేశారు. హసన్ - సోనియా దంపతులకు ఇప్పుడు మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఆస్తి హిందూ కుటుంబానికి చెందినదని, మతం మారినందున ఆమెకు అందులో ఎలాంటి హక్కు ఉండబోదని అంటూ ఆమె హక్కును ఆమె అన్నలు రద్దుచేశారు. నెలనెలా ఇచ్చే అద్దె కూడా ఆపేశారు. దాంతో ఆస్తిలో మూడోవంతు తనకు దక్కాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించింది. దాంతోపాటు తన అన్నలు తనను మోసం చేశారంటూ వాళ్లపై మోసం, నేరపూరిత కుట్ర, ఫోర్జరీ ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చింది.


