వరవరరావు తదితరులు విడుదలయ్యేనా!

What Are The Options Before The Supreme Court in The Arrest of Activists - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భీమ్‌ కోరెగావ్‌ కేసులో అరెస్టై ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న ఐదుగురు సామాజిక కార్యకర్తలకు సంబంధించి సుప్రీం కోర్టు తదుపరి ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందన్న అంశంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, రాంచీ, ఫరిదాబాద్, గోవాల్లో పుణె పోలీసులు ఆగస్టు 28వ తేదీన దాడులు నిర్వహించి విరసం సభ్యుడు వరవరరావుతోపాటు న్యాయవాది సుధా భరద్వాజ్, సామాజిక కార్యకర్తలు వెర్నాన్‌ గోన్సాల్వ్స్, అరుణ్‌ ఫెరైరా, గౌతమ్‌ నౌలేఖలను అరెస్ట్‌ చేయడం ఆగస్టు 29వ తేదీన సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు వారికి గహనిర్బంధం విధించడం తెల్సిందే. సెప్టెంబర్‌ 6వ తేదీతో వారి గహ నిర్బంధం ముగిసి పోనుండడంతో ఏడవ తేదీన వారిని సుప్రీం కోర్టు ముందు హాజరుపర్చాల్సి ఉంది. 

ఆ రోజున సుప్రీం కోర్టు ఎలాంటి ఉత్తర్వులను మంజూరు చేస్తుందన్నదే ప్రస్తుత చర్చ. వారిపై మొత్తానికి కేసునే కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసే విశిష్టాధికారం రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద సుప్రీం కోర్టుకు ఉంది. అయితే నిందితుల కేసుకు సంబంధించి దాఖలైన ప్రజాహిత (పిల్‌) వ్యాజ్యంలో వారిపై కేసును కొట్టివేయాల్సిందిగా కోరలేదు. వారిపై దాఖలైన కేసులో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో  దర్యాప్తు జరిపించాలని మాత్రమే డిమాండ్‌ చేశారు. ప్రజాహిత వ్యాజ్యంలో అలా డిమాండ్‌ చేయక పోవడానికి కూడా ఓ కారణం ఉంది. అది మొదటే డిమాండ్‌ చేసినట్లయితే కేసులో నిజానిజాల విచారణకు సుప్రీం కోర్టు, కేసును వాయిదా వేసి నిందితులను రిమాండ్‌కు పంపించే అవకాశం ఉంటుంది. పైగా నిందితులు తమపై తప్పుడు కేసును బనాయించారని, దాన్ని కొట్టి వేయాల్సిందిగా కోరుతూ పిటిషన్‌ ఎప్పుడైనా దాఖలు చేసుకునే అవకాశం ఉంది. కేవలం ప్రజాహిత వ్యాజ్యం స్ఫూర్తికే పరిమితం కావాలని భావించి పిటిషనర్లు మరో విషయం జోలికి పోలేదు. 

ప్రజాహిత వ్యాజ్యం డిమాండ్‌ చేయకపోయినా అన్యాయంగా కేసు బనాయించారనిపిస్తే దాన్ని ఏకపక్షంగా కొట్టివేసే అధికారాలను కూడా రాజ్యంగంలోని 142వ అధికరణ సుప్రీం కోర్టుకు  కల్పించింది. కనీసం ప్రాథమిక విచారణ కూడా జరపకుండా కేసును కొట్టివేస్తే అపార్థాలకు దారితీస్తుందన్న ఉద్దేశంతోను కేసును కొట్టివేయక పోవచ్చు. నిందితుల అరెస్ట్‌ ప్రక్రియ చట్టభద్దంగా జరిగిందా, లేదా? అన్న అంశాన్ని సుప్రీం కోర్టు ముందుగా పరిశీలిస్తుంది. అరెస్ట్‌ ప్రక్రియ సక్రమంగా జరగలేదని నిందితుల తరఫు న్యాయవాదులు ఇప్పటికే వెల్లడించారు. అరెస్ట్‌ సందర్భంగా నిందితులకు చూపిన పత్రాలు మరాఠీ భాషలో ఉన్నాయి. కొందరు నిందితులకు మరాఠి రానందున చట్ట ప్రకారం వారికి అర్థమయ్యే భాషలోకి తర్జుమా చేసిన పత్రాలనే చూపించాలి. అది జరగలేదట. అలాగే పుణెకు నిందితుల ‘ట్రాన్సిట్‌ (తరలింపు)’ రిమాండ్‌ కోసం చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ను కోరినప్పుడు ఆయనకు కేసు డైరీ చూపించలేదట. ఈ విషయాలను నిరూపించడంలో న్యాయవాదులు సఫలీకృతమైతే నిందితుల అరెస్ట్‌పై స్టే విధించి వారిని విడుదల చేయవచ్చు! ఊరు, జిల్లా లేదా రాష్ట్రం వీడి వెళ్లరాదనే షరతులతోనైనా నిందితులను విడుదల చేయవచ్చు!

నిందితులను పోలీసులు విచారించే ప్రక్రియే ఇంకా ప్రారంభం కానందున ‘స్వతంత్య్ర దర్యాప్తు’నకు సుప్రీం కోర్టు ఇప్పుడే ఆదేశించే అవకాశం లేదు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థకు అసమ్మతి అనేది భద్రతాపరమైన వాల్వ్‌ లాంటిది’ అని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నాయకత్వంలోని సుప్రీం కోర్టు బెంచీ ముందుగానే వ్యాఖ్యానించినందున నిందితులు విడుదల్యే అవకాశమే ఎక్కువగా ఉంది. నిందితులపై దాఖలైన కేసు మూలం ‘భీమా కోరెగావ్‌’ అల్లర్లే అయినప్పటికీ నిందితులు నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వారని, ఆ పార్టీకి నిధులు సమీకరించడమే కాకుండా ఆ పార్టీ తరఫున నియామకాలు జరుపుతున్నారని, మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘యాంటీ–ఫాసిస్ట్‌’ గ్రూపును కూడా ఏర్పాటు చేశారని పుణె పోలీసులు ఆరోపణలు చేశారు. అత్యంత వివాదాస్పద చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టమే కాకుండా భారతీయ శిక్షాస్మృతిలోని పలు కఠిన నిబంధనల కింద కేసులను నమోదు చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top