అంచులకు చేరుకున్నారు.. అంతలోనే బావిలోకి

Viral Video: Kerala Man Falls Into Well With Snake While Rescuing It - Sakshi

తిరువనంతపురం: ఓ పాము బావిలో పడిపోయింది. ఇది తెలుసుకున్న పాముల సహాయకుడు షగిల్‌ వెంటనే అక్కడికి చేరుకుని దానికి సహాయం చేయబోయాడు. కానీ చివరాఖరకు అతనికే వేరేవాళ్లు సహాయం అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో చోటు చేసుకుంది. ఓ పాము బావిలో పడటంతో షగిల్‌.. వల వేసి దాన్ని బయటకు తెద్దామనుకున్నాడు. కానీ ఆ బావి లోతుగా ఉండటంతో అది కుదర్లేదు. దీంతో అతనే నేరుగా బావిలోకి దూకి రక్షించాలనుకున్నాడు. వెంటనే తాళ్ల సాయంతో ఎలాగోలా బావిలోకి దిగాడు. పాము కాటు వేయకుండా నెమ్మదిగా దాని తలను అదిమి పట్టుకున్నాడు. వెంటనే ఆ పొడవాటి పాము ఏదో ప్రమాదం జరుగుతున్నదానిలా అతని శరీరాన్ని చుట్టుకుంది.

దీంతో అక్కడి స్థానికులు అతడిని పైకి లాగారు. హమ్మయ్య, పైకి వచ్చేసా అనుకున్న సమయంలో చేయి పట్టుతప్పడంతో ఒక్కసారిగా పాముతో పాటు అతను కూడా బావిలోకి పడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అతనికి, పాముకు ఎలాంటి గాయాలు కాలేదు. తిరిగి ఆ పామును అడవిలో విడిచిపెట్టారు. ఈ ఘటనపై షగిల్‌ మాట్లాడుతూ ‘పామును సురక్షితంగా బయటకు తీసుకురావడానికి నేనే ఓ తాడు కట్టుకుని నేరుగా బావిలోకి దిగాను. అది నన్ను కాటు వేయకుండా తల పట్టుకుని పై దాకా వచ్చాను. అక్కడున్న వారిని నా చేయి పట్టుకోమని సహాయం అడిగాను. కానీ వాళ్లు ఆలస్యం చేయడంతో అంతలోనే పట్టు కోల్పోయి బావిలో పడిపోయా’నని చెప్పుకొచ్చాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top