'విశాఖ- బెంగుళూరు రైలును ప్రారంభించండి'

Vijaya Sai Reddy Request To Piyush Goyal In Rajya Sabha - Sakshi

ఢిల్లీ : విశాఖ-బెంగుళూరు మధ్య డైలీ ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసును ప్రారంభించాలంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో  రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌కు విజ్ఞప్తిచేశారు. రాజ్యసభలో మంగళవారం రైల్వేల పనితీరుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం నుంచి బెంగుళూరుకు రోజువారీ నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసు కావాలన్నది ఎంతోకాలంగా విశాఖపట్నం ప్రజల కోరిక అని ఆయన చెప్పారు.  విశాఖ నుంచి బెంగుళూరుకు ప్రయాణించే ఐటీ నిపుణులకు  ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. అలాగే గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించిన విశాఖపట్నం-వారణాసి-అలహాబాద్‌ రైలు సర్వీసును కూడా త్వరగా ప్రారంభించాలని ఆయన కోరారు. (ఎన్నికల వాయిదాకే గెలిచినట్టు ఫీలవుతున్నారు)
  
ఇటీవల రెఫ్రిజిరేటెడ్‌ కంటైనర్లు కలిగిన రైలు ద్వారా రాయలసీమలోని తాడిపత్రి నుంచి ముంబైలోని పోర్టుకు అరటి పండ్ల రవాణా కోసం ప్రత్యేకంగా నడిపిన రైలు విజయవంతం అయిందని పేర్కొన్నారు. పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన రాయలసీమ ప్రాంతం నుంచి ముంబైకు ఈ తరహా ప్రత్యేక రైళ్ళను మరిన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే మంత్రిని కోరారు. అలాగే ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యంలో కిసాన్‌ రైలు సర్వీసును ప్రారంభిస్తామన్న ఆర్థిక మంత్రి హామీని ఆచరణలోకి తీసురావడం ద్వారా అటు రైల్వేలకు ఇటు రైతులకు కూడా ఆదాయపరంగా లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.గత ఏడాది డిసెంబర్‌ 2న రైల్వేల ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నివేదిక ఆందోళకరంగా ఉందని ఆయన అన్నారు. 2017-18లో రైల్వేల ఆపరేటింగ్‌ రేషియో 98.44 శాతంగా నమోదైంది. 

అలాగే 2016-17లో రైల్వేల రెవెన్యూ మిగులు కూడా గణనీయంగా తగ్గిపోయింది. నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడు కావడం, ఇతర ఆదాయ మార్గాలు కుంచించుకుపోవడం, సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్‌ చెల్లింపులు వగైరా కారణాలతో  రెవెన్యూ మిగులు క్షీణించిపోతున్నట్లుగా కాగ్‌ నివేదిక వెల్లడించింది. వివిధ వర్గాలకు ఇచ్చే పాస్‌లు, రాయితీలను ఎల్పీజీ లబ్దిదారులకు చెల్లిస్తున్న మాదిరిగా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌పై దృష్టి సారించాలన్నారు. అర్హులైన లబ్దిదారులకు మాత్రమే ప్రయోజనం కల్పించి రెవెన్యూ నష్టాలను తగ్గించుకోవాలని ఆయన సూచించారు. రైల్వేలలో ఇటీవల కాలంలో ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి అనేక చర్యలు చేపట్టినందుకు రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ను అభినందించారు.(ఏపీలో సోలార్‌ ఛర్ఖా క్లస్టర్‌) 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top