ఏపీలో సోలార్‌ ఛర్ఖా క్లస్టర్‌ 

Gadkari answer to Vijayasai Reddy question in Rajya Sabha - Sakshi

రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి గడ్కరీ జవాబు 
సాక్షి, న్యూఢిల్లీ:  మిషన్‌ సోలార్‌ ఛర్ఖా కింద ఏపీలో సోలార్‌ ఛర్ఖా క్లస్టర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిచ్చారు. మహిళలు, యువతకు ఉపాధి కల్పిస్తూ వారు తమ సొంత కాళ్ళపై నిలబడి అభివృద్ధి చెందాలన్నది మిషన్‌ సోలార్‌ ఛర్ఖా లక్ష్యాలలో మొదటిదని, తక్కువ ఖర్చుతో కూడిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంత నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకురావడం మిషన్‌ ఉద్దేశాలని మంత్రి తెలిపారు. కాగా విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియను వేగిరపరచి కార్యకలాపాలు ప్రారంభించవలసిందిగా విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. రైల్వే జోన్‌ ఏర్పాటైనా కార్యకలాపాలు ప్రారంభం కాలేదని చెప్పారు. కాగా, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లుపై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. దేవ భాషగా పరిగణించే సంస్కృత భాషకు తిరిగి జీవం పోసి కొంతమేరకైనా వాడుక భాషగా మార్చాలంటే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. 

నంబర్‌వన్‌ రాష్ట్రాల్లో ఏపీ ఒకటి 
కాంపొజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌ (సీడబ్ల్యూఎంఐ)లో ఏపీ అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటని జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా రాజ్యసభకు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తాజాగా నీతిఆయోగ్‌ జారీ చేసిన సీడబ్ల్యూఎంఐలో ఏపీ రెండో స్థానంలో నిలిచిందన్నారు.

ఏపీలో 49 వేల స్కూళ్లలో మరుగుదొడ్లు
స్వచ్ఛ్‌ భారత్, స్వచ్ఛ్‌ విద్యాలయ కార్యక్రమం కింద ఏపీలో 49,293 మరుగుదొడ్లు నిర్మించినట్లు కేంద్రం తెలిపింది. స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం గురించి ఎంపీ ఎన్‌.రెడ్డప్ప లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి నిషాంక్‌ పోఖ్రియాల్‌ సోమవారం సమాధానమిచ్చారు. మానసిక అనారోగ్యాన్ని నాలుగు స్థాయిల్లో కొలవనున్నట్లు తెలిపారు. ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌ అడిగిన ప్రశ్నకు పోఖ్రియాల్‌ జవాబిచ్చారు.   

ఆ పథకానికి రిటైర్మెంట్‌ వయసుతో సంబంధం లేదు 
సీనియర్‌ సిటిజన్ల కోసం అమలు చేస్తోన్న పీఎం వయో వందన యోజన పథకానికి రిటైర్మెంట్‌ వయసుతో సంబంధం లేదని కేంద్రం తెలిపింది. ఈ పథకానికి వయోపరిమితిని సవరించే యోచన ప్రభుత్వానికి ఉందా అని ఎంపీలు రఘురామకృష్ణరాజు, అవినాష్‌రెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దానికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సమాధానమిస్తూ.. వడ్డీ రేట్లు పడిపోయినట్లయితే సీనియర్‌ సిటిజన్లకు వడ్డీ నష్టం కలగకుండా రక్షించే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, దానికి రిటైర్మెంట్‌ వయసుతో సంబంధం లేదని చెప్పారు. మహిళల జీవన స్థాయిని మెరుగుపరచడానికి కేంద్రం అమలు చేస్తోన్న అనేక కార్యక్రమాలను కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ తెలిపారు. అసంఘటిత రంగంలో పనిచేసే పేద మహిళల ఆర్థిక స్థితిగతులను పెంచడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను గురించి ఎంపీలు పీవీ మిథున్‌ రెడ్డి, డీఎం కాతిర్‌ ఆనంద్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు.  

పర్యాటక రంగ ప్రోత్సాహానికి విభిన్న వ్యూహాలు 
దేశంలో విభిన్న పర్యాటక రంగాలను ప్రోత్సహించడం కోసం కేంద్రం అనుసరిస్తోన్న ప్రచార వ్యూహాల గురించి ఎంపీ బల్లిదుర్గా ప్రసాదరావు లోక్‌సభలో ప్రశ్నించారు. కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ సమాధానమిస్తూ.. విభిన్న భారతీయ పర్యాటక రంగాలను ప్రచారం చేయడానికి ఇంక్రెడిబుల్‌ æఇండియా బ్రాండ్‌ లైన్‌ కింద పర్యాటక శాఖ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. కాగా తొమ్మిది, çపది తరగతి విద్యార్థుల యాప్టిట్యూడ్‌ను పరీక్షించేందుకు సీబీఎస్‌ఈ, ఎన్సీఆర్టీ ట్రై అండ్‌ మేజర్‌ యాప్ట్యిట్యూడ్‌ అండ్‌ నేచురల్‌ ఎబిలిటీస్‌ (తమన్నా) అనే యాప్టిట్యూడ్‌ పరీక్షను రూపొందించాయని మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిషాంక్‌ పోఖ్రియాల్‌ చెప్పారు. లోక్‌సభలో ఎంపీలు గోరంట్ల మాధవ్, చంద్రశేఖర్‌ బెల్లాన అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

చంద్రబాబు మాట మీద నిలబడాలి
ఎంపీ వల్లభనేని బాలశౌరి  
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు షాక్‌ తప్పదని, ఆయన మాట మీద నిలబడి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు సోమవారం లోక్‌సభలో తమ స్థానాల్లో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఇదే అంశంపై చర్చించేందుకు వీలుగా మంగళవారం వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్టు బాలశౌరి తెలిపారు. చంద్రబాబును బ్యాక్‌ డోర్‌ బాబు అని పిలవాలని, ఆయన రెండు నాల్కల సిద్ధాంతం మరోసారి బట్టబయలైందని విమర్శించారు. నిన్నటి వరకు ఎన్నికలు జరిపించాలన్న చంద్రబాబు.. ఇప్పుడేమో బ్యాక్‌ డోర్‌ పాలిటిక్స్‌కు తెరతీశారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న మాటలపై చంద్రబాబు నిలబడాలని సవాలు విసిరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top