‘రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదు’

Vice President Venkaiah Naidu airs concern over farm populism during elections - Sakshi

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సంక్షోభాలకు రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. 2019లో కేంద్రంలో అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగంలో విశేష సేవలు అందించినందుకుగాను ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్‌ స్వామినాథన్‌కు ప్రైవేట్‌ సంస్థ ఐసీఎఫ్‌ఏ అగ్రికల్చర్‌ ప్రైజ్‌ ప్రకటించింది.

శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో వెంకయ్య చేతుల మీదుగా అగ్రికల్చర్‌ ప్రైజ్‌ కింద లక్ష డాలర్ల బహుమతిని స్వామినాథన్‌కు అందజేశారు. అగ్రికల్చర్‌ ప్రైజ్‌ను మొదటిసారి అందుకున్న వ్యక్తి స్వామినాథన్‌ కావడం విశేషం. రైతుల సమస్యలపై పార్లమెంటు, రాజకీయ పార్టీలు, నీతి ఆయోగ్, మీడియా దృష్టి కేంద్రీకరించాలని వెంకయ్య సూచించారు. రుణ మాఫీ, ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను తీసుకురావడం సరికాదన్నారు. ఒకసారి రైతుల రుణాలు మాఫీ చేయడం శాశ్వత పరిష్కారం కాదని పేర్కొన్నారు. రుణాలు ఇచ్చి తిరిగి కట్టవద్దని చెప్పే బ్యాంకులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. శాశ్వత పరిష్కారాల కోసం శాస్త్రవేత్తలు, పాలసీ రూపకర్తలు దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top