
'మోదీ వద్ద అల్లావుద్దీన్ దీపం లేదు'
స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపికయిన 20 నగరాలూ.. జూన్ 25వ తేదీ కల్లా ప్రాజెక్టు పనిని ప్రారంభించాలని కేంద్ర మంత్రి వెంకయ్య కోరారు.
జూన్ 25 కల్లా ‘స్మార్ట్ సిటీ’ పని మొదలవ్వాలి: వెంకయ్య
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపికయిన 20 నగరాలూ.. జూన్ 25వ తేదీ కల్లా ప్రాజెక్టు పనిని ప్రారంభించాలని కేంద్ర మంత్రి వెంకయ్య కోరారు. ఆ రోజు కల్లా ఈ ప్రాజెక్టు మొదలు పెట్టి ఏడాది పూర్తవుతున్న విషయం తెలిసిందే. ‘ఇండియా స్మార్ట్ సిటీ మిషన్ : తదుపరి చర్యలు’ అనే అంశంపై ఢిల్లీలో జరిగిన ఒక వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.. బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా వరకూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపిక కాలేదన్న విషయాన్ని ఉదహరిస్తూ.. ఈ ఎంపికలో ఎటువంటి రాజకీయాలూ లేవన్నారు.
‘‘ప్రతి నగరాన్నీ స్మార్ట్ సిటీగా మార్చటానికి ప్రధాని దగ్గర అల్లావుద్దీన్ దీపం లేదు. ’’ అని అన్నారు. ప్రజలు పాలనాయంత్రాంగానికి సహకరించకపోతే ఒక నగరం స్మార్ట్ సిటీగా ఎలా అవుతుందంటూ.. ఈ ప్రాజెక్టు విజయవంతం కావటానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు వినియోగించటానికి వీలులేదని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమానికి.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపికైన 20 నగరాలు, ఫాస్ట్ ట్రాక్ పోటీలో పాల్గొంటున్న 23 నగరాలు గల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు పాల్గొన్నారు.