విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే: హైకోర్టు | uttarakhand highcourt orders for floor test on 31st march | Sakshi
Sakshi News home page

విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే: హైకోర్టు

Mar 29 2016 3:16 PM | Updated on Sep 3 2017 8:49 PM

విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే: హైకోర్టు

విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే: హైకోర్టు

ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అన్న విషయాన్ని తేల్చుకోడానికి గురువారం.. అంటే ఈనెల 31వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అన్న విషయాన్ని తేల్చుకోడానికి గురువారం.. అంటే ఈనెల 31వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ నిర్ణయం తీసుకున్న కేంద్రప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. గత కొన్ని నెలలుగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలకమైన ఆర్థికబిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న విషయం రుజువైందని కేంద్రం చెప్పింది. అయితే.. మార్చి 28న తాను విశ్వాసపరీక్ష ఎదుర్కొంటానని గవర్నర్ కేకే పాల్‌ను కోరినా, ఈలోపే కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది.

70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీకి ఝలక్‌ ఇచ్చి బీజేపీ పక్షాన చేరిన తొమ్మిది మంది రెబెల్‌ ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్‌ స్పీకర్‌ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో అసెంబ్లీలో విశ్వాస పరీక్షను రావత్ ప్రభుత్వం అలవోకగా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. స్పీకర్ సస్పెన్షన్ నిర్ణయంతో సభలో మొత్తం సంఖ్య 61 పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి 27 మంది సభ్యులుండగా, మరో ఆరుగురు స్వతంత్ర సభ్యులు కూడా సర్కారుకు మద్దతిస్తారని అంటున్నారు. అదే నిజమైతే 33 మంది సభ్యుల బలంతో రావత్ సర్కార్‌ విశ్వాస పరీక్షలో గట్టెక్కే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ స్వతంత్ర సభ్యులు సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే మాత్రం హరీష్ రావత్ ఇంటిదారి చూసుకోక తప్పదు.

Advertisement
 
Advertisement
Advertisement