
అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర
గిరిజనులకు ప్రయోజనం కలిగేలా చింతపండు వంటి పది రకాల అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం వెల్లడించారు.
కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరం వెల్లడి
భువనేశ్వర్(ఒడిశా) : గిరిజనులకు ప్రయోజనం కలిగేలా చింతపండు వంటి పది రకాల అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం వెల్లడించారు. ఈ నిర్ణయం అటవీ ప్రాంత నివాసితులకు మేలు చేకూర్చుతుందన్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, కరెంట్ వంటి మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్రం ప్రాధాన్యమిస్తుందని ఆయన తెలిపారు. రెండు రోజుల ఒడిశా పర్యటనలో భాగంగా ఆదివారం ఇక్కడ రాష్ర్ట గిరిజన శాఖాధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు, సహజ సంపదకు నష్టం జరగకుండా చేపట్టే ప్రాజెక్టులకే తన మద్దతుంటుందన్నారు. ఒడిశాలోని కాందహార్‌లో పోస్కో కంపెనీ ప్రతిపాదించిన ముడి ఇనుము మైనింగ్‌పై సంబంధిత మంత్రులకు తన అభిప్రాయాలు చెబుతానన్నారు.
పోలవరంపై ఒడిశాకు మద్దతు
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్ట్‌పై ఒడిశా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తానని, పార్లమెంట్‌లోనూ పోరాడతానని కేంద్ర మంత్రి జుయల్ ఓరం తెలిపారు. అవసరమైతే ఈ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తానన్నారు. రాష్ట్ర ప్రజల ఆదరణతో పార్లమెంటుకు వెళ్లిన నేపథ్యంలో ఇక్కడి వారి ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యమిస్తానన్నారు.