కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లదాఖ్‌

Union Territories of Jammu & Kashmir and Ladakh - Sakshi

     ఇప్పటివరకు      ఇకపై
రాష్ట్రాలు    29           28
కేంద్రపాలిత ప్రాంతాలు    7    9

న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాల విభజన తర్వాత భారతదేశంలో వైశాల్యపరంగా అతి పెద్ద కేంద్ర పాలిత ప్రాంతంగా (యూటీ) జమ్మూ కశ్మీర్‌ నిలవనుంది. దీని తర్వాతి స్థానంలో లదాఖ్‌ ఉండనుంది. కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాలన్న కేంద్రం నిర్ణయాన్ని పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. లదాఖ్‌ను యూటీ చేయడాన్ని ఆ ప్రాంతంలో నివసించే కొన్ని వర్గాల ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన జమ్మూ కశ్మీర్, లదాఖ్‌లతో కలిపి భారత్‌లో యూటీల సంఖ్య తొమ్మిదికి చేరింది. జమ్మూ కశ్మీర్, లదాఖ్, ఢిల్లీ, పుదుచ్చేరి, డమన్‌ అండ్‌ డయ్యూ, దాద్రా నగర్‌ హవేలీ, ఛండీగర్, లక్షద్వీప్, అండమాన్‌ నికోబార్‌ దీవులు ప్రస్తుతం యూటీలుగా ఉన్నాయి. వీటిలో ఢిల్లీ, పుదుచ్చేరీలకు శాసనసభలు ఉండగా.. తాజాగా వీటికి జమ్మూ కశ్మీర్‌ జతచేరింది. శాసనసభలు ఉన్న యూటీలకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌లు ఉంటారు. ఛండీగఢ్, దాద్రా నగర్‌ హవేలీ, డమన్‌ అండ్‌ డయ్యూ, లక్షద్వీప్, లదాఖ్, అండమాన్‌ నికోబార్‌ దీవులను కేంద్రం పాలించనుంది. యూటీల నుంచి పార్లమెంట్‌కు ఎంపికయ్యే వారి సంఖ్య మారుతుంటుంది. ఢిల్లీ నుంచి ఏడుగురు ఎంపీలు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  

107 అసెంబ్లీ స్థానాలు: ‘జమ్మూ కశ్మీర్‌ పునర్విభజన బిల్లు–2019’ప్రకారం జమ్మూ కశ్మీర్‌ శాసనసభకు 107 స్థానాలు ఉండనున్నాయి. పునర్విభజన తర్వాత మరో 7 స్థానాలు పెరిగి 114కు చేరే అవకాశం ఉంది.

‘370’లు ఇంకా ఉన్నాయి!
ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువగా వర్తించే ఆర్టికల్‌ –371 ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా రాష్ట్రాలకు ఈ ఆర్టికల్‌ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. ఆర్టికల్‌ –371ఏ నాగాలాండ్‌ హక్కులకు సంబంధించినది.  నాగా ఆచార చట్టం ప్రకారం పౌర, నేర న్యాయపాలన నిర్ణయాలకు సంబంధించి, భూ యాజమాన్యం, బదలాయింపునకు సంబంధించి నాగా అసెంబ్లీ ఆమోదించకుండా పార్లమెంట్‌ చేసే చట్టాలేవీ నాగాలకు వర్తించవు. ఆర్టికల్‌ –371ఏ లాంటిదే మిజోరంనకు సంబంధించిన ఆర్టికల్‌ –371జి.  అస్సాంకు ఆర్టికల్‌ –371బి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. ఇక ఆర్టికల్‌ –371సి మణిపూర్‌కు, ఆర్టికల్‌ –371ఎఫ్‌ సిక్కింకు, ఆర్టికల్‌ –371హెచ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top