
అమ్మ కోలుకోవాలని..
ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ ఆదివారం తమిళనాడు వ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు విశిష్ట పూజలు చేశారు.
- తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో అన్నాడీఎంకే శ్రేణుల విశిష్ట పూజలు
- మదురైలో పాల బిందెలతో 50 వేల మంది ఊరేగింపు
- జయ కోలుకుంటున్నారు: కేంద్ర మంత్రి వెంకయ్య
సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ ఆదివారం తమిళనాడు వ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు విశిష్ట పూజలు చేశారు. ప్రత్యేక వ్రతాన్ని పాటించి, పాల బిందెలతో వేలాది మంది ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి దేవతలకు అభిషేకాలు నిర్వహించారు. చర్చిల్లో కొవ్వొత్తులతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మదురైలో జయ పేరవై, అన్నాడీఎంకే జిల్లా పార్టీ నేతృత్వంలో యాభై వేల మందితో పాల బిందెల ఊరేగింపు నిర్వహించారు. ఇందులో 25 వేల మంది మహిళలు పాల్గొన్నారు. వారంతా వ్రతదీక్షతో తిరుప్పరగుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయానికి పాలబిందెలతో వెళ్లి అమ్మవారు, స్వామివార్లకు అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. అమ్మ ఆరోగ్యంగా ప్రజల్లోకి రావాలని దేవుళ్లని వేడుకున్నారు. పూజల్లో మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాలుపంచుకొన్నారు. చెన్నై అపోలో ఆసుపత్రికి వచ్చే అన్నాడీఎంకే వర్గాలు పట్టణంలో తమకు నచ్చిన ఆలయాలకు వెళ్లి అమ్మ కోసం పూజలు నిర్వహించేవారికోసం ఒక ఆటో డ్రైవర్ ఉచితంగా ఆటో నడుపుతున్నాడు. జయలలిత చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద మహిళలు చేతిలో కర్పూరం వెలిగించుకుని అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కేకే నగర్‌లో ధన్వంతరి ఆయుష్షు యాగం నిర్వహించారు.
వదంతులు సరికాదు: వెంకయ్య
సీఎం జయలలిత ఆరోగ్యంపై వదంతులు మంచి పద్ధతి కాదని కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ఆయన అపోలో ఆస్పత్రికివెళ్లి జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత కోలుకుంటున్నట్లు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఉదయం పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి కూడా అపోలో ఆస్పత్రికి వెళ్లి జయలలిత ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సీపీఐ ఎంపీ రాజాలతో పాటు పలువురు నేతలు ఆస్పత్రిలో జయ ఆరోగ్యంపై ఆరాతీశారు. జయ ఆరోగ్యవంతురాలుగా మళ్లీ ప్రజాసేవకు అంకితం కావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు వారు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఆపద్ధర్మ సీఎంను నియమించాలి: స్టాలిన్
పద్దెనిమిది రోజులుగా సీఎం జయలలిత ఆస్పత్రిలోనే ఉండటంతో పాలన కుంటుపడిందని, ఆపద్ధర్మ సీఎం లేదా కొత్త సీఎంను నియమించి పాలనను గాడిలో పెట్టాలని ప్రధాన ప్రతి పక్ష నేత, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. మరికొన్నాళ్లు జయ ఆస్పత్రిలోనే ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలో తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ స్పందిస్తూ.. ఇన్‌చార్జి సీఎం నియామకం అనవసరమన్నారు. రాష్ట్రపతి పాలన విధించాలని సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేయడంపై మనిదయ నేయమక్కల్ కట్చి నేత జవహరుల్లా మండిపడ్డారు. కాగా, సీనియర్ మంత్రి పన్నీరు సెల్వంతో పాటు మరి కొందరు అపోలో ఆసుపత్రికే పరిమితమవుతున్నారు. అపోలో నుంచి ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్, సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావుల ఆదేశాలతో అధికారులు విధులు నిర్వహిస్తున్నాయి.
ఆపద్ధర్మం అవసరం లేదు: అన్నాడీఎంకే
జయలలిత కోలుకుంటున్నందున ఆపద్ధర్మ సీఎం అవసరం లేదని అన్నాడీఎంకే ఆదివార ం నిర్ణయించింది.దీనిపై విపక్షాలు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో అన్నాడీఎంకే అత్యున్నతస్థాయి సమావేశాన్ని జరిపినట్లు సమాచారం. సీఎం కోలుకుంటున్నందున కేబినెట్‌లో మార్పులూ అవసరం లేదని భావించారని తెలుస్తోంది.