అట్టుడుకుతున్న తూత్తుకుడి! | Tuticorin, Police baton-charged on protesters | Sakshi
Sakshi News home page

May 22 2018 1:12 PM | Updated on Aug 21 2018 6:08 PM

Tuticorin, Police baton-charged on protesters  - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటీకోరిన్‌)లో అట్టుడుకుతోంది. కాలుష్యానికి కారణమవుతున్న స్థానిక స్టెరిలైట్‌ కంపెనీని మూసివేయాలంటూ ప్రజాసంఘాలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వటంతో తూత్తుకుడిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలు ధ్వంసం అయ్యాయి.  వివరాల్లోకి వెళితే... స్టెరిలైన్‌ కంపెనీని మూసివేయాలంటూ మంగళవారం ఆందోళనకారులు వేలాదిగా తరలివచ్చి కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు.

వారి ప్రయత్నాలను అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లదాడి చేశారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు  ఒక్కసారిగా పోలీసు వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో ఇద్దరు మృతి చెందగా, పలువురు ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు తూత్తుకుడిలో పోలీసుల లాఠీచార్జ్ ఘటన తమిళనాడును కుదిపేస్తోంది. ప్రభుత్వ తీరును రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని రెచ్చగొట్టేవిధంగా ఆంక్షలు విధించి వారిపై అమానుషంగా దాడి చేయడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. సంఘటనా స్థలం వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు పోలీసులు భారీగా మోహరించారు. స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ విస్తరణకు వ్యతిరేకంగా తూత్తుకుడిలో గత వందరోజులుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement