సాంటాక్లాజ్‌లా మారిన ట్రాఫిక్‌ పోలీసులు

Traffic Cops Dress As Santa Claus Distribute Chockolates In Goa - Sakshi

క్రిస్‌మస్‌ పండగ కోసం షాపింగ్‌లు, ఆర్డర్లు అంటూ ఎవరి పనుల్లో వాళ్లున్నారు. కానీ ఇక్కడ చెప్పుకునే ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం ప్రజలను చైతన్యవంతం చేయడానికి అలుపెరగకుండా కృషి చేస్తున్నారు. గోవాలోని ట్రాఫిక్‌ పోలీసులు వినూత్న పద్ధతితో ట్రాఫిక్‌ అవగాహన కార్యక్రమం చేపట్టి వార్తల్లో నిలిచారు. ఇక్కడి ట్రాఫిక్‌ పోలీసులు సాంటాక్లాజ్‌లా వేషం ధరించి రోడ్లపైకి వచ్చారు. జనాల నోరు తీపి చేస్తూ ట్రాఫిక్‌ ఆంక్షల గురించి తెలియజేశారు. జీవితం విలువైనదని, ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించి కష్టాలను కొనితెచ్చుకోవద్దని వాహనదారులకు సూచించారు.


ఈ సమయంలో బైక్‌పై వెళ్తున్న కొంతమంది ఐఎస్‌ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్లను వాడటం లేదని గుర్తించారు. పెద్ద వాహనాలు నడుపుతున్నవారు సీటుబెల్టు పెట్టుకోకపోవడం గమనించారు. జాగ్రత్త వహించడం అత్యంత ముఖ్య విషయమని, ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించవద్దని సుతిమెత్తంగా వారిని హెచ్చరించారు. చాక్లెట్లు పంచుతూ వాహనదారులు పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులను అక్కడి జనాలు అభినందించారు. ఇలా అర్థం అయ్యేలా ఓపికగా చెప్తే అందరూ కచ్చితంగా రూల్స్‌ పాటిస్తారని ఓ వాహనదారుడు పేర్కొన్నాడు. అందరూ పండగ బిజీలో మునిగిపోతే ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం వారి విధుల్లో మునిగితేలుతున్నారని ఓ మహిళ పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top