‘మహా’ శత్రువులే కారకులు | To break alliance the cause of enemies of maharashtra | Sakshi
Sakshi News home page

‘మహా’ శత్రువులే కారకులు

Sep 26 2014 11:42 PM | Updated on Sep 2 2017 2:00 PM

మహాకూటమి విచ్ఛిన్నం కావడానికి మహారాష్ట్ర శత్రువులే కారణమని శివసేన పేర్కొంది.

సాక్షి, ముంబై: మహాకూటమి విచ్ఛిన్నం కావడానికి మహారాష్ట్ర శత్రువులే కారణమని శివసేన పేర్కొంది. బీజేపీని మహారాష్ట్ర శత్రువని అభివర్ణించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠీ అనుకూల ఎజెండాకు ప్రాధాన్యమివ్వనున్నట్లు శివసేన పరోక్షంగా సంకేతాలిచ్చింది. ‘శివసేన, బీజేపీల పొత్తు కొనసాగాలని మహారాష్ట్రలోని 11 కోట్ల ప్రజలు ఆకాంక్షించారు. కాని వీరందరి ఆకాంక్షలు సర్వనాశనం కావడానికి కారకులు మహారాష్ట్ర శతృవులే అవుతారు’ అని సామ్నా ఆరోపించింది.

 ఇది సంయుక మహారాష్ట్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన 105 మంది మృతవీరులను అవమానించడమేనని పేర్కొంది. హిందూత్వ విధానాలతో 25 ఏళ్ల పాటు కొనసాగిన బంధం ముగిసిపోవడం దురదృష్టకరమని సంపాదకీయం పేర్కొంది. నిన్నటి వరకు ఈ టెంటులో ప్రార్థనలు చేసిన వారు నేడు మరో శిబిరంలో నమాజు చేస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యాఖ్య, భారతీయ ముస్లిమ్‌లు దేశభక్తులనిప్రశంసించిన ప్రధాని మోడీని ఉద్దేశించి చేసినట్టు తెలుస్తోంది. పోయిన వారు (బీజేపీ) ‘పిండం’ కోసం ఎగిరిపోయిన కాకులు, మిగిలిన వారు మావ్లే (ఛత్రపతి శివాజీ సైనికులు) అని వ్యాఖ్యానించింది.

 కాంగ్రెస్ పార్టీపై కూడా సామ్నా విమర్శలు గుప్పించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముంబై నగర ప్రాధాన్యతను తగ్గించేందుకు కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారని విమర్శించింది. నిజానికి కాంగ్రెస్ రక్తమాంసాలున్న మొరార్జీ దేశాయ్ కాలంలోనే ఆ కుట్ర జరిగిందని గుర్తు చేసింది. సమైక్య ముంబై, మహారాష్ట్రల కోసం కాంగ్రెస్, దాని నాయకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాషాయ పతాకం రాష్ట్రాన్ని రక్షించగలదని పేర్కొంది. ఇటు కాషాయ కూటమి, అటు కాంగ్రెస్-ఎన్సీపీల బంధం తెగిపోవడంపై సామ్నా వ్యాఖ్యానిస్తూ అమావాస్య జీవనం ముగిసింది, నవరాత్రి శుభదినాలు ప్రారంభమయ్యాయని తెలిపింది.

 సామ్నా వ్యాఖ్యలు దురదృష్టకరం: బీజేపీ
 తమను మహారాష్ట్ర శత్రువులని శివసేన వ్యాఖ్యానించడం దురదృష్టకరమని బీజేపీ పేర్కొంది. ఇకపై ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండగలరని బీజేపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి రాజీవ్ ప్రతాప్ రూడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

 కూటమిలోని చిన్న పార్టీలను మోసగించే కుట్రలో బీజేపీ భాగం పంచుకోగలదని శివసేన ఆశించరాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతోనే వారు సీట్ల సర్దుబాటును ప్రతిపాదించారని, దానిని ఆమోదించి ఉంటే చిన్న పార్టీలన్నీ కూటమి నుంచి బయటకు వెళ్లిపోయేవని రూడీ పేర్కొన్నారు. శివసేన వాడే పరుష పదజాలంతో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిని ఓడించలేమని ఆయన హితవు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement