ఆయన్ని కట్టడి చేయడానికి రాజ్యాంగ సవరణ 

TN Seshan Makes Historical Changes In Elections - Sakshi

కేంద్ర ఎన్నికల సంఘంపై  చెరిగిపోని ముద్ర  

శేషన్‌ సంస్కరణలతో ఎన్నికల ప్రక్రియలో పెనుమార్పులు 

కేంద్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ  

ఎన్నికల సంఘం అంటే గుర్తుకు వచ్చేది టీఎన్‌ శేషనే. ఎన్నికల సంఘంపై చెరిగిపోని ముద్ర వేసి ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. కాగితాలకే పరిమితమైన ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని ఆచరణలోకి తీసుకొచ్చారు. ఎన్నికల సంఘానికి రాజ్యాంగం కల్పించిన అధికారాలను విస్తృత స్థాయిలో ఉపయోగించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తన సంస్కరణల ద్వారా ఆయన రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఈ క్రమంలో ఆయన వివాదాస్పదుడిగా పేరు కూడా గడించారు. 1990లో ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో భారీగా అక్రమాలు, ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై పరిమితి లేకపోవడం, పోలింగ్‌ బూత్‌ల కబ్జా, అధికార దుర్వినియోగం ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రధాన కమిషనర్‌గా నియమితులయ్యారు. వీటన్నింటినీ కట్టడి చేసేందుకు ఆయన పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

ఈ ప్రక్రియలో ఆయన ప్రభుత్వాన్ని సైతం సవాలు చేశారు. రాజ్యాంగం ఇచ్చిన తన అధికారాల్లో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోరాదని తేల్చిచెప్పారు. ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను, సమగ్రతను కాపాడటం, ఓటర్లకు సాధికారిత కల్పించడం, ఎన్నికల విధివిధానాలను మార్చడం, ఎన్నికల చట్టాలను సవరించడం వంటివి ఆయన ప్రధాన లక్ష్యాలు. అందుకు ముందు ప్రజల్లో ఎన్నికల కమిషన్‌ పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. దీనికి గాను ఆయన ముందుగా తన కార్యాలయాన్ని సంస్కరించడం మొదలుపెట్టారు. కార్యాలయాల్లోని గోడలపై ఉన్న దేవుళ్లు, దేవతల ఫొటోలను తీసేయించారు. ఎన్నికల కమిషన్‌ లౌకిక నిర్వచన పరిధిలోకి వస్తుందని ఉద్యోగులకు ఉద్భోధించారు. మధ్యాహ్న భోజన విరామ సమయాన్ని తగ్గించారు. అధికారులను ఎక్కువ సమయం గ్రంథాలయంలో గడిపేలా చేశారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల కేసులపై దృష్టి సారించారు.  

అభిశంసన తీర్మానానికి దారితీసిన నిర్ణయాలు 
వివిధ ఆరోపణలపై పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులపై ఆయన అనర్హత వేటు వేశారు. దీంతో ఆయన రాజకీయ నాయకులకు లక్ష్యంగా మారారు. దీని తర్వాత ఆయనపై అభిశంసన తీర్మానాన్ని పెట్టగా అప్పటి స్పీకర్‌ తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల సమయంలో డిప్యుటేషన్‌ మీద తన పరిధిలోకి తీసుకునే విషయంలో కూడా ప్రభుత్వాలకు, శేషన్‌కు మధ్య యుద్ధమే నడిచింది. దీనిపై సుప్రీంకోర్టు శేషన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 

శేషన్‌ కట్టడికి రాజ్యాంగ సవరణ 
1993లో తమిళనాడు ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలను పంపాలని కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్ర హోంశాఖ నిరాకరించింది. దీంతో శేషన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ఎన్నికల సంఘం అధికారాన్ని గుర్తించే వరకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీంతో శేషన్‌ను కట్టడి చేసేందుకు ఎన్నికల కమిషన్‌లో మరో ఇద్దరు కమిషనర్లను నియమిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. 

అభ్యర్థుల ప్రచార వ్యయానికి పరిమితులు 
అసెంబ్లీ అభ్యర్థి ప్రచార వ్యయాన్ని గరిష్టంగా రూ.40 వేలుగా, పార్లమెంట్‌ అభ్యర్థి ప్రచార వ్యయాన్ని రూ.1.70 లక్షలుగా నిర్ణయించారు. ఈ పరిమితి అమల్లోకి వచ్చిన తర్వాత పీవీ నరసింహారావు ప్రభుత్వం ఈ పరిమితిని పెంచేందుకు ప్రయత్నించింది. అయితే ఈ పరిమితిని ఉల్లంఘిస్తే సహించేది లేదని శేషన్‌ తేల్చి చెప్పారు. 1993 ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఖర్చుపై ఆయన ఎక్కువ దృష్టి సారించారు. ఎన్నికల లెక్కలు సమర్పించనందుకు 1,488 మందిపై మూడేళ్ల పాటు అనర్హత వేటు వేశారు. 

ఓటరు గుర్తింపు కార్డు ఉండాల్సిందే.. 
ఎన్నికలు సజావుగా జరగటానికి ఓటర్లకు అవగాహన కల్పించడం ముఖ్యమని శేషన్‌ గ్రహించారు. అందుకోసం జాతీయస్థాయిలో ఓటరు అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. ఓటరు హక్కులు, బాధ్యతల గురించి విస్తృత ప్రచారం నిర్వహించారు. 1992లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణ మొత్తం ఎన్నికల ప్రక్రియను మార్చేసింది. అర్హులైన ఓటర్లందరికీ ఫొటో గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. రాజకీయ నేతలు ఈ ప్రతిపాదనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఓటరు గుర్తింపు కార్డు విషయంలో ప్రభుత్వం 18 నెలలు గడిచినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గుర్తింపు కార్డులు ఇచ్చేంత వరకు ఎన్నికలు నిర్వహించేది లేదని శేషన్‌ తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత ఎన్నికలు జరిగాయి. 

‘లౌడ్‌ స్పీకర్‌’ నిషేధం 
శేషన్‌ తీసుకొచ్చిన మరో సంస్కరణ గోడలపై రాతలు, లౌడ్‌ స్పీకర్ల వినియోగం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై పోస్టర్లు అతికించడం వంటి వాటిపై నిషేధం విధించారు. దీనివల్ల ఎన్నికల సందర్భంగా శబ్దకాలుష్యం తగ్గింది. ప్రచార ఖర్చుపై పరిమితి ఉండటంతో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. కులం, మతం, భావోద్వేగాల ఆధారంగా ఓట్లు అడగరాదంటూ కూడా శేషన్‌ ఓ ఉత్తర్వులు ఇచ్చారు. వీటి అమలు కోసం ప్రత్యేక పరిశీలకులను నియమించారు. రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలను పరిశీలించే అధికారం పరిశీలకులకు ఇచ్చారు. అభ్యర్థుల ప్రసంగాలపై కూడా నిఘా ఉంచారు. సంస్కరణల్లో అత్యంత ముఖ్యమైంది.. ప్రవర్తనా నియమావళి. ఎన్నికల సందర్భంగా ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోరాదో ఈ నియమావళి నిర్ణయిస్తుంది. ఇది మొత్తం ఎన్నికల తీరుతెన్నులనే మార్చేసింది. ఈ నియమావళికి ప్రతి అభ్యర్థితోపాటు రాష్ట్రపతి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ కట్టుబడి ఉండాల్సి వచ్చింది. ఎన్నికల సందర్భంగా వీడియో బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ నియమావళితో అనేక అక్రమాలకు, అవకతవకలకు తెరపడింది. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఈ సంస్కరణలకు మద్దతు లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ‘నోటా’ను తీసుకొచ్చింది.  

లెక్కలు చూపాల్సిందే.. 
అధికారులు, నేతలు కుమ్మక్కై ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఎన్నికల పరిశీలకులను నియమించాలని శేషన్‌ నిర్ణయించారు. ప్రధానంగా ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు వీరిని ఉపయోగించుకున్నారు. ఇది సత్ఫలితాన్ని ఇచ్చింది. అంతేకాకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 77ను కూడా ఆయన ఉపయోగించారు. ఎన్నికల లెక్కలను ప్రమాణపూర్వక అఫిడవిట్‌ రూపంలో సమర్పించేలా చర్యలు తీసుకున్నారు.  – యర్రంరెడ్డి బాబ్జీ సాక్షి, అమరావతి ప్రతి పైసాకూ 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top