పప్పు రైతులపై దిగుమతుల పిడుగు

Thunderbolt Of Imports On Paddy Farmers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల నుంచి పప్పు దినుసులను దిగుమతి చేసుకోవడానికి దేశంలోని రిజస్టరైన పప్పు దినుసుల వ్యాపారులు, మిల్లర్లు జూన్‌ ఒకటవ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటోంది. ఈ మేరకు మే 16వ తేదీనే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ‘దేశీయంగానే పప్పు దినుసుల దిగుమతి దండిగా ఉన్నప్పుడు విదేశాల నుంచి దిగుమతి ఎందుకు, దండగ! అని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ముందుగానే ప్రశ్నించాం. అయితే ప్రపంచ వాణిజ్య సంస్థ నియమ నిబంధనల ప్రకారం విదేశాల నుంచి పప్పు దినుసులను దిగుమతి చేసుకోవాల్సిందేనంటూ ప్రభుత్వం నుంచి సమాధానం రావడంతో ఊరుకున్నాం’ అని అఖిల భారత పప్పు మిల్లుల సంఘం చైర్మన్‌ సురేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. తాము ఈ విషయమైన మే ఆరవ తేదీనే కేంద్ర వాణిజ్య శాఖను కలిసి చర్చలు జరిపినట్లు ఆయన వివరించారు. 

పప్పు దినుసులను శుద్ధి చేసే సామర్థ్యాన్నిబట్టి మిల్లుల యజమానులు విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, ఎవరికి ఎంత దిగుమతి కోటా కావాలో స్పష్టంగా తెలియజేస్తూ జూన్‌ ఒకటవ తేదీ నుంచి కేంద్ర వాణిజ్య విభాగానికి దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన కోటా తక్కువనా, లేక మిల్లర్‌ కోట్‌ చేసినది తక్కువనా ? అన్న అంశం ఆధారంగా తక్కువనే ప్రాతిపదికగా తీసుకుని కేంద్రం దిగుమతుల కేటాయింపులను ఖరారు చేస్తుంది. ఆగస్టు 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ దిగుమతుల వల్ల రైతులు నష్టపోతారా లేక మిల్లర్‌ నష్టపోతారా? అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. 

పప్పు దినుసుల్లో, వాటి వినియోగంలో భారత్‌ ప్రపంచంలోనే పెద్ద దేశం. మార్కెట్‌లో ధర తక్కువగా ఉన్నప్పుడు మిల్లర్లు పప్పు దినుసులు కొనగోలు చేసి వాటిని నిల్వ చేస్తారు. తద్వారా ధర పెరిగినప్పుడు అమ్ముకుంటారు. దేశంలో ఉత్పత్తి పెరిగినా, తగ్గినా, విదేశాల నుంచి పప్పుదినుసుల దిగుమతి పెరిగినా, తగ్గినా వ్యాపారులకు, మిల్లర్లకు వచ్చే నష్టం పెద్దగా ఎప్పుడూ ఉండదు. నష్టపోయేది ఎక్కువగా ఎప్పుడూ రైతులే. పప్పుదినుసులు ఎక్కువ పండించినప్పుడు వాటిని నిల్వచేసుకునే సామర్థ్యం వారికి ఎక్కువ ఉండదు. అందుకు అవసరమైన శీతల గిడ్డంగులు వారికి అందుబాటులో ఉండవు. ఇటు రైతుకు, అటు వినియోగదారులకు భారం కాకుండా ధరలు హేతుబద్ధంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకే కేంద్రం 23 వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరలను నిర్ణయించింది. 

మార్కెట్‌లో రైతుకు కనీస మద్దతు ధర లభించనప్పుడు ఆ సరకు కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కేవలం బియ్యం, గోధుమల కొనుగోలుకే ప్రభుత్వం ఎక్కువగా పరిమితం అవుతుండడంతో రైతులు నష్టపోతున్నారు. 2016లో తూర్పు ఆఫ్రికాలో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడి దేశాలతో ఒప్పందం చేసుకోవడం వల్ల కెన్యా, టాంజానియా దేశాల నుంచి 2017లో భారీ ఎత్తున పప్పు దినుసులు భారత్‌కు దిగుమతి చేసుకోవడం వల్ల గిట్టుబాటు ధర తగ్గి పప్పుదినుసుల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని లక్షల  టన్నుల పప్పు దినుసులకు కొనుగోలుదారులు లేకుండా పోయారు.

భారత్‌తో ఒప్పందం కారణంగా పలు తూర్పు ఆఫ్రికా దేశాల రైతులు ఈసారి తమ పప్పు దినుసుల సాగును మరింత విస్తీర్ణం చేశారు. భారత్‌తో అవగాహనా రాహిత్యం వల్ల తమ దేశంలో కూడా 20 లక్షల మెట్రిక్‌ టన్నుల పప్పు దినుసలకు బయ్యర్లు లేకుండా పోయారని కెన్యాలోని కిటూ కౌంటీ గవర్నర్‌ చారిటీ కలుకి మీడియాకు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి కూడా భారత్‌ పప్పు దినుసులను దిగుమతి చేసుకుంటే భారతీయ రైతులు మరింత నష్టపోవాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top