
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేరస్తుల ఏరివేత కొనసాగుతోంది. సహరాన్‌పూర్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ నగర్, ముజఫర్‌నగర్ జిల్లాలో 24 గంటల్లో 7 ఎన్‌కౌంటర్లు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మోస్ట్‌వాంటెడ్ నేరస్తులు హతమయ్యారు. ఏడుగురిని అరెస్టుచేశారు. నేరస్తులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి.
గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ గాయపడ్డ గ్యాంగ్‌స్టర్ శ్రవణ్ చౌదరీ ఆదివారం చికిత్స పొందుతూ చనిపోయాడని శాంతిభద్రతల డీఐజీ ప్రవీణ్ తెలిపారు. సహరాన్‌పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పరారీలో ఉన్న సలీమ్ అనే నేరస్తుడిని హతమార్చినట్లు చెప్పారు. ఓ రైతు నుంచి బైక్, రూ.లక్ష దోచుకున్నట్లు ఫిర్యాదు రావడంతో తొలుత పోలీసులు రంగంలోకి దిగారన్నారు. ఛిల్కానాలో బైక్‌ను ఆపాల్సిందిగా కోరినప్పటికీ సలీమ్ పోలీసులపై కాల్పులు జరిపాడనీ, దీంతో తాము ఎదురుకాల్పులు జరపడంతో దుర్మరణం చెందాడన్నారు.