
ప్రగతిశీలం.. ఫలవంతం
‘‘ఈ బడ్జెట్ విస్పష్టమైన దార్శనికత గల బడ్జెట్. ప్రగతిశీలమైన, సానుకూలమైన, కార్యసాధకమైన, ఆచరణసాధ్యమైన, ఫలవంతమైన బడ్జెట్.
- అందరికీ అనుకూల బడ్జెట్: ప్రధాని
- ‘జనధన’ ఆధారిత పథకాలు
- ‘జన కల్యాణంగా మారతాయి
న్యూఢిల్లీ: ‘‘ఈ బడ్జెట్ విస్పష్టమైన దార్శనికత గల బడ్జెట్. ప్రగతిశీలమైన, సానుకూలమైన, కార్యసాధకమైన, ఆచరణసాధ్యమైన, ఫలవంతమైన బడ్జెట్. మన అభివృద్ధికి పునరుత్తేజాన్నిస్తుంది. పేదల అనుకూలమైన, అభివృద్ధి అనుకూలమైన, మధ్యతరగతికి అనుకూలమైన, యువతకు అనుకూల బడ్జెట్‌ను రూపొందించినందుకు ఆర్థికమంత్రి జైట్లీకి అభినందనలు. రైతులు, యువత, పేదలు, మధ్యతరగతి వర్గాలపై ఈ బడ్జెట్ స్పష్టమైన దృష్టిని కేంద్రీకరించింది. బడ్జెట్ పెట్టుబడులకు సానుకూలంగా ఉంది. పన్ను అంశాలపై అన్ని సందేహాలనూ ఇది తొలగిస్తుంది. ఇక్కడ స్థిరమైన, ఊహించదగిన, న్యాయమైన పన్ను వ్యవస్థ ఉందని విదేశీ పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తుంది. 2022 నాటికి అందరికీ ఇల్లు, ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య, సంపూర్ణ విద్యుదీకరణల సాధించాలని జైట్లీ లక్ష్యాలను నిర్దేశించారు.
నల్లధనం అంశంపై కొత్త చట్టం తీసుకువస్తున్నట్లు చెప్పటం.. విదేశాల్లో దాచేసిన నల్లధనంలో ప్రతి రూపాయినీ వెనక్కు తెచ్చేందుకు మా నిబద్ధతను విశదీకరిస్తోంది. జాతీయ ప్రాధాన్యాలను నెరవేరుస్తూనే రాష్ట్రాల ఆకాంక్షలను గౌరవించినందుకు జైట్లీకి అభినందనలు. జనధన యోజన విజయవంతం కావటం సంతోషం కలిగిస్తోంది. సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, విద్యా లక్ష్మి కార్యక్రమాలు జనధనను జన కళ్యాణంగా మారుస్తాయి’’