వాళ్లు సాక్షులా..??!

These are the Witnesses in arresting Activists - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల దేశంలోని ఆరు నగరాల్లో పుణె పోలీసులు దాడులు నిర్వహించి, పది మంది సామాజిక కార్యకర్తల ఇళ్లలో సోదాలు నిర్వహించి వారిలో ఐదుగురిని అరెస్ట్‌ చేసినప్పుడు పోలీసులు అనుసరించిన తీరు చూస్తుంటే చట్టం గురించి అంతో ఇంతో తెలిసిన ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ విషయాలు తెలిసి.. పోలీసు వర్గాలే ఆశ్చర్యపోయినా ఆశ్చర్యపోవాల్సింది లేదు! సామాజిక కార్యకర్తల ఇళ్ల సోదాల సందర్భంగా, వారి అరెస్ట్‌ల సందర్భంగా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని 41 బీ సెక్షన్‌ ప్రకారం కుటుంబసభ్యుల్లో ఒకరు లేదా స్థానికంగా పలుకుబడి కలిగిన వ్యక్తి ఎవరైనా సాక్షిగా సంతకం చేయడం తప్పనిసరి.

అయితే ఆగస్టు 28వ తేదీన ఐదుగురు సామాజిక కార్యకర్తల అరెస్ట్‌ సందర్భంగా పంచనామా లేదా అరెస్ట్‌ ధ్రువపత్రంపై, స్వాధీన వస్తువల జాబితా పత్రాలపై పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఓ ప్యూన్, ఓ క్లర్క్, ప్రభుత్వ బీజే వైద్య కళాశాలకు చెందిన ఓ క్లర్క్, ఓ టెక్నీషియన్‌లతోపాటు ఎక్కడ పనిచేస్తారో కూడా తెలియని మరో నలుగురు యువకులు సంతకాలు చేశారు. పుణెకు చెందిన వీరంతా పుణె పోలీసులతోపాటు వచ్చిన సాక్షులు. అరెస్టైన ఐదుగురు సామాజిక కార్యకర్తల్లో ఒకరైన గౌతమ్‌ నవ్‌లేఖ విడిగా వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ఇటీవల ఢిల్లీ హైకోర్టు సాక్షుల అంశాన్ని అండర్‌లైన్‌ చేసుకుంది. పుణె పోలీసులు తమ వెంట తీసుకొచ్చిన కేసు పత్రాలు, కేసుకు సంబంధించిన నోటీసులు అన్ని కూడా మరాఠీ భాషలోనే ఉన్నాయి. చట్టం ప్రకారం నిందితులకు తెల్సిన బాషలోనే అవి తర్జుమా అయి ఉండాలి.

ఇలా సాక్షులను వెంట తీసుకెళ్లడం తమకు కొత్త కాదని, తాము మహారాష్ట్రలో ఈ పద్ధతిని ఎప్పటి నుంచో పాటిస్తున్నామని పుణె పోలీసు జాయింట్‌ కమిషనర్‌ శివాజీ బోడఖే వ్యాఖ్యానించారు. తాము సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులనే సాక్షులుగా ఎంపిక చేసుకుంటామని, వారికైతే కేసు పట్ల, విచారణ పట్ల అవగాహన ఉంటుందని అన్నారు. ఇలాంటి సాక్షులు చట్టవిరుద్ధమని నిందితుల తరఫు న్యాయవాది కామిని జైస్వాల్‌ చెప్పారు. పోలీసులు తెచ్చుకునే సాక్షులు వారి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగే అవకాశం ఉంటుందని, పోలీసుల ఏజెంట్లుగా వ్యవహరించే వాళ్లు నిందితుల పక్షాన ఎలా సాక్షులుగా నిలుస్తారని ప్రశ్నించారు.

వీరే సాక్షులు
ఫరీదాబాద్‌లో మానవ హక్కుల న్యాయవాది సుధా భరద్వాజ్‌ను అరెస్ట్‌ చేసినప్పుడు పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని విశ్వరామ్‌బాగ్‌ వార్డు ఆఫీసులో పనిచేస్తున్న రవిదాస్‌ థానే అనే జూనియర్‌ క్లర్క్, అదే ఆఫీసులో పనిచేస్తున్న ప్యూన్‌ హర్షాల్‌ కదమ్‌ సాక్షులుగా వ్యవహరించారు. ఇద్దరు ఉద్యోగులను సాక్షులుగా పంపించాలంటూ పుణె పోలీసు కమిషనర్‌ కార్యాలయం నుంచి తమ కార్యాలయానికి ఓ లేఖ వచ్చిందని, అందుకని తమను పంపించారని హర్షాల్‌ కదమ్‌ తెలిపారు. ఇంతకుముందు కూడా రెండు, మూడుసార్లు పోలీసులు సాక్షిగా పిలిస్తే వెళ్లానని, అయితే పుణె దాటి బయటకు రావడం మాత్రం ఇదే మొదటి సారని ఆయన చెప్పారు.

వరవర రావు అరెస్ట్‌ సందర్భంగా....
విరసం సభ్యుడు, రచయిత వరవర రావు అరెస్ట్‌ సందర్భంగా పంచనామా పత్రంలో పుణె వాసులైన గజేంద్ర కాంబ్లే (49), అల్తాఫ్‌ భగవాన్‌ (51)లను సాక్షులుగా చూపారు. వారు ఉద్యోగం చేస్తున్నారని ఉన్నది కానీ ఎక్కడ, ఏం చేస్తున్నారో వివరాలు లేవు. పంచనామాపై వరవర రావు మేనల్లుడు ఎన్‌. వేణుగోపాల్‌ సంతకం చేశారు. అయితే ఎవరి ఇళ్లయితే సోదా చేశారో వారికి మరాఠీ రాదనే వ్యాఖ్యం రాసి ఆయన సంతకం చేసినట్లు ఉంది. ఏడు పేజీల పంచనామాపై ప్రతి పేజీలో పోలీసులు సంతకాలు చేశారు. ఒక్క ఏడో పేజీలోనే వరవర రావు భార్య హేమలత సంతకం తీసుకున్నారు. పోలీసులు మోసం చేయదల్చుకుంటే లోపలి ఆరు పేజీలు మార్చుకోవచ్చన్నమాట. వరవర రావు అల్లుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌ కేవీ కూర్మనాథ్‌ ఇంటి సోదా సందర్భంగా పుణె వాసులైన జగదీశ్‌ ఎల్వేకర్, భజరంగ్‌ ధాల్వేలను పోలీసులు సాక్షులుగా చూపారు. తన ఇంట్లో రెండు వేల పుస్తకాలుండగా, వాటిలో 40 పుస్తకాలనే ఏరి పోలీసులు తీసుకెళ్లారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికే పోలీసులు ఇలా వ్యవహరించారని కూర్మనాథ్‌ మీడియాతో వ్యాఖ్యానించారు.

రాంచీలో సోదా సందర్భంగా
రాంచీలో సామాజిక కార్యకర్త స్థాన్‌ స్వామి ఇంటి సోదా సందర్భంగా సాక్షులుగా ప్రభుత్వ బీజే వైద్య కళాశాల ఆస్పత్రిలో సీనియర్‌ క్లర్క్‌గా పనిచేస్తున్న నంద్‌కిషోర్‌ అగార్కర్‌ (57), ససూన్‌ ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మోహన్‌ గినులే (56)లను చూపారు.

గౌతమ్‌ అరెస్ట్‌ సందర్భంగా
జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌతమ్‌ను ఢిల్లీలో అరెస్ట్‌ చేసినప్పుడు రాందాస్‌ షెల్కే (34), అప్పారావు రాథోడ్‌ (27)లను సాక్షులుగా చూపారు. వారిని కూడా పుణె వాసులుగా పేర్కొన్నారుగానీ వారికి సంబంధించి ఎలాంటి వివరాలు లేవు. మిగతావారి అరెస్ట్‌ల సందర్భంగా కూడా పుణె వాసులనే సాక్షులుగా చూపారు.

చడవండి: వరవర రావు తదితరులు విడుదలయ్యేనా?

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top