ఒకే ప్రపంచం.. ఒకే గ్రిడ్‌!

Targeting 40 per cent non-fossil power by 2030, says Narendra Modi - Sakshi

ఎల్లల్లేని సౌరశక్తి ప్రసారానికి ముందుకెళ్దాం: మోదీ

న్యూఢిల్లీ: 2030 కల్లా భారత్‌ 40% శిలాజేతర ఇంధనాలను ఉత్పత్తి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘ఒకే ప్రపంచం, ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్‌’ నినాదాన్నిచ్చిన ప్రధాని.. సరిహద్దుల్లేకుండా అన్ని దేశాలు సౌరశక్తితో అనుసంధానమయ్యేలా ముందుకురావాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. మంగళవారం అంతర్జాతీయ సౌర కూటమి సభ్యుల సమావేశం సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఒకే ప్రపంచం, ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్‌ అనేది మా స్వప్నం.

ఒక చోట అస్తమించినా మరోచోట ఉదయించే సూర్యుని నుంచి 24 గంటలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. భూ ప్రపంచమంతా సూర్యుడు ఒకేసారి అస్తమించడు. 121 దేశాల ఈ సౌరకూటమి ప్రపంచం భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా ఇంధనాన్ని ఉత్పత్తి చేసే మరో ‘ఒపెక్‌’ గా మారుతుందని ఆశిస్తున్నాను. కొన్ని దశాబ్దాలుగా చమురు బావులు ప్రపంచవ్యాప్తంగా పోషిస్తున్న పాత్రను.. భవిష్యత్తులో సౌరశక్తి తీసుకుంటుంది’ అని పేర్కొన్నారు. 2022 కల్లా 175గిగా వాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేసే లక్ష్యంతో భారత్‌ పనిచేస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ రంగంలో భారత్‌లో వచ్చే నాలుగైదేళ్లలో 5–6 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్‌ కూడా వేదికపై ఉన్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top