యూపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ : ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో నిందితులుగా ఉన్నవారి పేరిట ఏర్పాటు చేసిన పోస్టర్‌లను తొలగించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. వివరాల్లోకి వెళితే.. పోలీసులు యూపీలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో పాల్గొన్న వారి వివరాలతో కూడిన పోస్టర్‌లను ఏర్పాటు చేశారు.
దీనిపై అలహాబాద్ హైకోర్టు స్పందిస్తూ.. నిందితుల పేరిట పోస్టర్‌లు ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టింది. పోలీసులు అనవసరంగా వారి గోపత్యకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. ఆ పోస్టర్‌లను తొలగించాల్సిందిగా యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుపై యూపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. గురువారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. అలహాబాద్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణ ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం చేపడుతుందని వెల్లడించింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి