ఆ అరెస్టుల్లో జోక్యం చేసుకోలేం

Supreme Court refuses to grant relief to five activists - Sakshi

హక్కుల కార్యకర్తల అరెస్టుపై 2:1 మెజారిటీతో సుప్రీం తీర్పు

సిట్‌ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తినీ తిరస్కరించిన కోర్టు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని భీమా–కోరేగావ్‌ అల్లర్ల కేసుకు సంబంధించి హక్కుల కార్యకర్తలు వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్‌ ఫెరీరా, గౌతమ్‌ నవలఖ, వెర్మన్‌ గంజాల్వెజ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసిన ఘటనలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అరెస్టుల వ్యవహారంపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) నియమించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐదుగురు హక్కుల కార్యకర్తలను విడుదల చేయాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో శుక్రవారం తీర్పు ఇచ్చింది.

తమ నిర్ణయంపై అప్పీలు చేసుకునేందుకు హక్కుల కార్యకర్తలకు ప్రస్తుతమున్న గృహనిర్బంధాన్ని 4 వారాల పాటు పొడిగించింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌లు తీర్పునిస్తూ తమ కేసును ఎవరు విచారించాలో ఎంచుకునే అధికారం నిందితులకు ఉండదని తేల్చారు. అసమ్మతి, రాజకీయ భిన్నాభిప్రాయం కారణంగా పోలీసులు ఈ అరెస్టులు చేపట్టలేదనీ, నిందితులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు.

ఆధారాలను  పరిశీలించామనీ, విచారణ సందర్భంగా ఏదో ఒకపక్షం వైపు తాము ప్రభావితమయ్యే అవకాశమున్నందున వాటి లోతుల్లోకి వెళ్లలేదని పేర్కొన్నారు.  గతేడాది డిసెంబర్‌ 31న మహారాష్ట్రలోని పుణె సమీపంలో దళిత సంఘాలు ‘ఎల్గర్‌ పరిషత్‌’ పేరుతో సమావేశం నిర్వహించాయి. సదస్సు అనంతరం అక్కడి భీమా–కోరేగావ్‌ ప్రాంతంలో హింస చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించి పుణె పోలీసులు గత నెల 28న ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. దీంతో  వీరిని విడుదల చేసి, అరెస్టులపై సిట్‌ ఏర్పాటు చేయాలంటూ చరిత్రకారిణి రొమీలా థాపర్‌తో పాటు కొందరు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ఐదుగురిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీం ఆదేశించింది.

తీర్పును స్వాగతించిన బీజేపీ..
దేశానికి వ్యతిరేకంగా, ప్రధాని మోదీ హత్యకు అర్బన్‌ నక్సల్స్‌ పన్నిన కుట్రను పోలీసులు విజయవంతంగా ఛేదించారని మహారాష్ట్ర  సీఎం ఫడ్నవీస్‌ అన్నారు. గృహనిర్బంధం పూర్తయ్యాక వీరి కస్టడీ కోసం కోర్టుకెళతామన్నారు. ఈ ఐదుగురికి మద్దతు ఇచ్చి జాతీయ భద్రతతో చెలగాటమాడిన కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సిగ్గుతో తలదించుకోవాలని బీజేపీ విమర్శించింది. వీరికి  మద్దతు ఇచ్చినందుకు రాహుల్‌ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.

అసమ్మతి గొంతు నొక్కేస్తున్నారు
ఇద్దరు న్యాయమూర్తుల అభిప్రాయంతో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ విభేదించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రభుత్వం అసమ్మతి గొంతును నొక్కేసేందుకు ప్రయత్నిస్తోందని తన తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసమ్మతి, భిన్నాభిప్రాయం అసలైన ప్రజాస్వామ్యానికి సూచిక అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో, సరైన విచారణ జరపకుండా ఈ ఐదుగురిని వేధిస్తే భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కుకు అర్థం లేకుండా పోతుందని అభిప్రాయపడ్డారు.

మావోయిస్టులు రాసుకున్నట్లు భావిస్తున్న లేఖలను మహారాష్ట్ర పోలీసులు మీడియాకు ఉద్దేశపూర్వకంగా విడుదల చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పాక్షిక విచారణపై అనుమానాలు తలెత్తేలా పోలీస్‌ అధికారులు వ్యవహరించారని దుయ్యబట్టారు. ఈ కేసులో సిట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందనీ, విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని తన 43 పేజీల తీర్పులో జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అసమ్మతి అన్నది ప్రెజర్‌ కుక్కర్‌కు ఉన్న సేఫ్టీ వాల్వ్‌ లాంటిదనీ, దాన్ని పోలీస్‌ బలంతో అణిచివేయలేరని పునరుద్ఘాటించారు.

ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా పోలీసులు మీడియాను వాడుకోవడం ద్వారా విచారణ నిష్పాక్షికత దెబ్బతింటుందనీ, కేసుల్లో దోషులెవరో నిర్ధారించి తీర్పు చెప్పేందుకు పోలీసులు న్యాయమూర్తులు కాదని వ్యాఖ్యానించారు. ఐదుగురు హక్కుల కార్యకర్తలు ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయలేదనీ, కొత్తగా కేసును రిజస్టర్‌ చేయని విషయాన్ని ముగ్గురు జడ్జీలు తీర్పులో ప్రస్తావించారు.

జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top