‘మీటూ’కి సుప్రీంలో చుక్కెదురు..!

Supreme Court Declines Urgent Petition On Metoo - Sakshi

అత్యవసర పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ‘మీటూ’ ఉద్యమానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మీటూ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాల్సిందిగా న్యాయవాది ఎమ్‌.ఎల్‌ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ మేరకు మీటూపై దాఖలైన ప్రజా ప్రయోజనం వ్యాజ్యంను అత్యవసర విచారణగా భావించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన​ గగోయ్‌, ఎస్‌కే కౌల్‌తో కూడిన ధర్మసనం సోమవారం ప్రకటించింది. ప్రముఖులపై ప్రకంపనలు సృష్టిస్తున్న లైంగిక ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి, ఫిర్యాదు చేసిన మహిళలకు జాతీయ మహిళా కమిషన్‌ ద్వారా రక్షణ కల్పించాలని పిటిషనర్‌ ఇటీవల సుప్రీంకోర్టును కోరారు.

పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు లైంగిక వేధింపుల నిరోధక​ చట్టం (2013) ప్రకారం పని ప్రదేశాల్లో ఇంటర్నల్‌ కమిటీని ఏర్పాటు చేయాలని జాతీయ మహిళా కమిషన్‌ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. గతంలో నానా పటేకర్‌ తనని లైంగిక వేధింపులకు గురిచేశారని, నటి తనుశ్రీ సంచలన ఆరోపణలకు ఇటీవల తెరతీసిన విషయం తెలిసిందే. అంతటితో ఆగని ఆరోపణలు చివరికి కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌ రాజీనామా వరకు వచ్చాయి. కాగా మీటూపై దాఖలైన అత్యవసర పిటిషన్‌ను సుప్రీం తొసిపుచ్చిన నేపథ్యంలో సాధారణ పిటిషన్‌లతో పాటు షెడ్యూల్‌ ప్రకారం దానిని కూడా విచారించనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top