లేడీస్‌ హాస్టల్లో స్పై కెమెరాలు

Spy cameras found in Chennai womens hostel - Sakshi

చెన్నైలో ఘటన.. యజమాని అరెస్ట్‌

చెన్నై: దక్షిణ భారతంలో అతిపెద్ద నగరం చెన్నైలోని తిళ్లై గంగానగర్‌లో అది ఒక లేడీస్‌ హాస్టల్‌. దాని యజమాని సంపత్‌రాజ్‌ అలియాస్‌ సంజయ్‌. రెండు నెలల క్రితమే ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకొని హాస్టల్‌ నడుపుతున్నాడు. నెలకి రూ. 5,500 అద్దె చెల్లిస్తే ఆ హాస్టల్‌లో ఉండొచ్చు. ధర అందుబాటులో ఉండటంతో విద్యార్థినులు, ఉద్యోగినులు ఆ హాస్టల్‌లో చేరారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ హాస్టల్‌ ఎంత ప్రమాదకరమో, అమ్మాయిల బతుకుల్ని ఎలా బజారుపాలు చేస్తోందో వెలుగులోకి వచ్చింది. డిసెంబర్‌ 2న ఒక అమ్మాయి తలంటు స్నానం చేసి జుట్టు ఆరబెట్టుకోవడానికి బాత్‌రూమ్‌లోనే ఉన్న ప్లగ్‌ పాయింట్‌లో హెయిర్‌ డ్రయర్‌ను పెట్టింది. కానీ అది ప్లగ్‌లోకి సరిగ్గా వెళ్లకపోగా, ఏదో అడ్డుపడినట్టుగా అనిపించింది. దీంతో ఆ అమ్మాయికి అనుమానం వచ్చింది. ఆ ప్లగ్‌ పాయింట్‌ను గట్టిగా పీకి చూసేసరికి ఇంకేముంది ఆమె అనుమానమే నిజమైంది. అందులో రహస్య కెమెరా అమర్చి ఉంది. షాక్‌ తిన్న ఆమె వెంటనే ఆడంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్‌ అంతా పరిశీలిస్తే ఎక్కడ పడితే అక్కడే ఉన్న స్పై కెమెరాలు బయటపడ్డాయి. ప్లగ్‌ సాకెట్‌లలో మూడు కెమెరాలు, బల్బుల్లోపల రెండు కెమెరాలు, వార్డ్‌రోబ్‌ హ్యాంగర్లలో ఒక కెమెరా, గోడ గడియారాలలో మూడు కెమెరాలు, చివరికి బెడ్‌ రూమ్‌ కర్టెన్లలో కూడా రహస్య కెమెరాలు దొరకడంతో పోలీసు అధికారులే ఆశ్చర్యపోయారు. సంపత్‌ రాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఎక్కడైనా ఉండొచ్చు జాగ్రత్త! 
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. ఎంత మంచి ఉందో, అంత ప్రమాదకరంగానూ మారుతోంది.అతి చిన్న సైజులో రహస్య కెమెరాలు తయారీ జరుగుతూ ఉండటంతో ఎక్కడ పడితే అక్కడ వాటిని అమరుస్తున్నారు. అమ్మాయిల నగ్న వీడియోలు తీసి ఇంటర్నెట్‌లో ఉంచుతామని బెదిరింపులు, ఆ సీడీలను అమ్ముకోవడం.. అదంతా ఒక విషవలయం. అందుకే అమ్మాయిలెవరైనా ఎక్కడికెళ్లినా ఒకటికి రెండు సార్లు స్పై కెమెరాలు ఉన్నాయేమోనని చెక్‌ చేసుకోవాలి. హాస్టల్స్‌లోనే కాక షాపింగ్‌ మాల్స్‌ ట్రయల్‌ రూమ్స్‌లో, హోటల్‌ రూమ్స్‌ ఇలా రహస్య కెమెరాలు ఎక్కడైనా ఉండొచ్చు. సరదాగా మీరు ఏ షాపింగ్‌ మాల్‌కో వెళితే గోడల మీద రంధ్రంలాంటి డిజైన్లు ఏమైనా కనిపిస్తే, కచ్చితంగా వాటిని అనుమానించాల్సిందే. ఆ రంధ్రాల మాటున రహస్య కెమెరా ఉండడానికి అవకాశం ఉంది. ఇక బయటకి సాధారణంగా కనిపించే ఎలక్ట్రికల్‌ సాకెట్లలో కూడా పెట్టే అతి సూక్ష్మమైన కెమెరాలు కూడా వచ్చేశాయి. బట్టలు పెట్టుకునే వంకీల మాదిరిగా ఉండే కెమెరాలు కూడా మార్కెట్‌లో ఉన్నాయి. చివరికి ఎవరి ఊహకూ అందని రీతిలో మరుగుదొడ్లను శుభ్రం చేసే బ్రష్‌లలో కూడా స్పై కెమెరాలను అమరుస్తున్నారంటే ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం దృశ్యాలను చిత్రీకరించేవి మాత్రమే కాదు, వాయిస్‌ రికార్డు కెమెరాలు కూడా అమరుస్తున్నారు. ఈ కెమెరా లు చాలా వరకు రీచార్జ్‌ చేసుకునేవే. మనుషుల కదలికలు, మాటలకు ఆటోమేటిక్‌గా ఆన్‌ అయ్యే కెమెరాలు కూడా ఉన్నాయి. ఎక్కడికెళ్లినా ఎంత అప్రమత్తంగా ఉండాలో, స్పై కెమెరాలను ఎలా గుర్తించాలో అమ్మాయిలు నేర్చుకోవాలి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top