మంత్రాలయ వచ్చి నేను ఆత్మహత్య చేసుకోవాలా?

Should I Commit Suicide At Mantralaya - Sakshi

సాక్షి, సతారా : 'న్యాయం కోసం ప్రతి ఒక్క వృద్ధుడు మంత్రాలయ వచ్చి ఆత్మహత్యకు పాల్పడాల్సిందేనా?' ఈ ప్రశ్న వేసింది చంద్రశేఖర్‌ జంగం అనే వ్యక్తి. ఆయన వయసు ఇప్పుడు 98 ఏళ్లు. అయితే, ఆయన సామాన్యుడేం కాదు. గొప్ప పోరాటయోధుడు.. యుద్ధ వీరుడు. భారత ఆర్మీలో సైనికుడిగా విశిష్ట సేవలు అందించాడు. 1962లో చైనాతో, 1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాల్లో ఆయన పాల్గొన్నారు. 1971 సుబేదార్‌ హోదాలో పదవీ విరమణ పొందారు.

అయితే, ఒకప్పుడు ఈ దేశం కోసం పోరాడి చివరి మజిలీకి చేరిన సమయంలో ఆయన నోటి నుంచి ఆత్మహత్య మాట ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? సమస్య షరా మాములే. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు టోకరా పెట్టింది. సైనికులకు కేటాయించే భూమిని ఆయనకు కేటాయించలేదు. రెండు సార్లు ఆయన యుద్ధం నిలిచి గెలిచాడుగానీ, తన హక్కుల కోసం మాత్రం సొంత దేశంలోనే 54 ఏళ్లుగా ఓడిపోతూనే ఉన్నారు. చివరకు తనకు న్యాయం జరగడం కోసం మంత్రాలయ వచ్చి ఆత్మహత్యకు పాల్పడమంటారా అని ఆవేదనతో ప్రశ్నించారు.

వివరాల్లోకి వెళితే.. చంద్రశేఖర్‌ జంగం తొలిసారిగా 1943లో భారత ఆర్మీలో చేరారు. ఎలక్ట్రికల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కింద యుద్ధ ట్యాంకుల విభాగంలో పనిచేశారు. 1962లో ఇండో-చైనా, 1965 ఇండో-పాక్‌ యుద్ధంలో పాల్గొన్నారు. రక్ష మెడల్‌ కూడా స్వీకరించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సైనికులు స్థలం కొనుక్కునే అవకాశం ఉండటంతో 1964లో 15.5 గుంటల భూమిని సతారాలో కొనుగోలుచేశారు. అందుకు రూ.3,547లు చెల్లించారు. ఇప్పటికీ ఆ రశీదు కూడా ఉంది. అయితే, ఆ భూమిని మాత్రం చంద్రశేకర్‌కు బదిలీ చేయలేదు.

ఆ ప్రొసీజర్‌ కూడా ముందుకు తీసుకెళ్లలేదు. దీంతో ఆయన 1968 నుంచి  ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 1971లో ఆయన పదవీ విరమణ పొందాక కూడా ప్రతివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరిగారు. ఇక ఆ పనిపూర్తికాకపోవడంతో కనీసం తన డబ్బు తనకైనా తిరిగి ఇవ్వాలని 1977 నుంచి అడగడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ఆ పని కూడా జరగలేదు. 1983వరకు పోరాడిన వాళ్లు తిరిగి ఆశ వదులుకున్నారు.

మళ్లీ చిగురించిన ఆశ
సతారాలోని రహీమత్‌పూర్‌లో ఉంటున్న చంద్రశేఖర్‌కు ముగ్గురు కూతుర్లు.. ఇద్దరు కుమారులు. కుమారుల్లో ఒకరు తమకు ప్రభుత్వం చేసిన అన్యాయంపై గట్టిగా పోరాటం చేయాలనుకున్నారు. ఒక ఎన్జీవో, అఖిల్‌ భారతీయ వీర్షవ్య లింగాయత్‌ మహాసంఘ(ఏబీవీఎల్‌ఎం) సహాయంతో ఆర్టీఐ ద్వారా కొనుగోలు చేసిన భూమి వివరాలు రాబట్టాడు. అయితే, కొన్ని రికార్డులు లభించగా కొన్ని మాత్రం మాయమయ్యాయి. 15.5గుంటల భూమిని వారు కొనుగోలు చేయగా అందులో రోడ్డు విస్తరణకోసం దాదాపు సగానికిపైగా భూమి పోయి ఇప్పుడు 5.5గుంటలు మాత్రం మిగిలినట్లు తెలిసింది.

దీంతో తమకు ఇక భూమి దక్కదని నిర్ణయించుకొని వేరే చోట అయినా కనీసం భూమి కేటాయించాలని కోరారు. గత వారం కుటుంబ సభ్యులు ఏబీవీఎల్‌ఎం చీఫ్‌ డాక్టర్‌ విజయ్‌ జంగమ్‌తో కలిసి మహారాష్ట్ర విధాన భవన్‌కు వెళ్లగా అక్కడి రెవెన్యూ మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్‌కు ఫైల్‌ పంపించాలని ఆదేశించారు. అయితే, ఈ విషయంపై ఓ సీనియర్‌ కలెక్టర్‌ స్పందించి ప్రభుత్వం తలుచుకుంటే అది పెద్ద విషయం కాకపోయినా ఎందుకో ప్రతిసారి రివ్యూల పేరిట వాయిదాలు వేస్తుందని అభిప్రాయపడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top