‘చరిత్ర గురించి అడిగితే భూగోళ శాస్త్రం గురించి చెప్తున్నారు’

Shiv Sena Slams Yogi Adityanath Over Mob Killing Cop In Bulandshahr - Sakshi

ముంబై : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నగరాల పేర్లు మారుస్తూ బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో జరిగే సంఘటనల గురించి ఆయనకు పెద్దగా పట్టదంటూ శివసేన పార్టీ విమర్శలు చేసింది. రాష్ట్రంలోని బులందషహర్‌ పట్టణంలో జరిగిన దాడులను ఉద్దేశిస్తూ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో.. ‘జవాన్లు, పోలీసులకు మతం ఉండదు. అలాగే, అధికారంలో ఉన్నవారు మతాలకతీతంగా తమ బాధ్యతలను నిర్వర్తించడంపై దృష్టి పెట్టాలి. యోగి పాలనలో అల్లర్లు చెలరేగుతున్నాయి. బులందషహర్‌ ఘటనలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటి వరకూ ఆ కుటుంబాన్ని పరామర్శించేంత తీరిక యోగికి చిక్కలేదు. ఎందుకంటే ఆయన నగరాల పేర్లు మార్చడంలోనే తీరిక లేకుండా ఉన్నారంటూ’ శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యనాథ్‌ బీజేపీ తరఫున రాష్ట్రంలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యోగి తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. ‘యోగి హైదరాబాద్‌ పేరు మారుస్తానని చెప్పుకొంటున్నారు.. కానీ, తన సొంత రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాత్రం ఆయన నోరువిప్పడం లేదు. యోగి ముందు చరిత్రకు సంబంధించిన ఓ ప్రశ్న ఉంది. కానీ, ఆయన భౌగోళిక అంశాలకు సమాధానాలు ఇస్తున్నారు. హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా ఎప్పుడు మారుస్తారు? అన్నది ఇప్పుడు ఆయన ముందున్న ప్రశ్న కాదు. అయోధ్యలో రామ మందిరం ఎప్పుడు నిర్మిస్తారన్నదే ప్రశ్న. ఇది చరిత్రకు సంబంధించిన ప్రశ్న’ అని శివసేన విమర్శించింది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్‌ దుకాణం మూసేసిందని ఆ పార్టీ విమర్శించింది. ‘కేంద్ర మంత్రులందరూ తమ దుకాణాన్ని మూసేసి, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ హామీలు ఇవ్వడంలో బిజీ అయిపోయారు’ అని ఎద్దేవా చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top