
న్యూఢిల్లీ: తమ దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డు వల్లే తమకు కరోనా సోకిందని ఓ కుటుంబం పోలీసులను ఆశ్రయించిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో నివాసముంటున్న ఓ కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. ఈ కుటుంబానికి చెందిన ఎనభైయేళ్ల వృద్ధుడు బుధవారం కరోనాతో మరణించగా, అతని కొడుకు వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నాడు. అతని భార్య ఈ మధ్యే కరోనాను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. అయితే తమకు కరోనా సోకడానికి సెక్యూరిటీ గార్డు కారణమని, అతను వైరస్‌కు ప్రధాన కేంద్రంగా నిలిచిన నిజాముద్దీన్‌లోని తబ్లిగి జమాత్ సభ్యుల మతపర కార్యక్రమానికి వెళ్లాడని ఆరోపణలు గుప్పించింది. (కరోనాకు ‘ప్లాస్మా’ చికిత్సే మందు)
దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గార్డు మర్కజ్ సమావేశాన్ని సందర్శించి ఉండవచ్చని నోటీసులు అంటించి కాలనీ వాసులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆనాటి నుంచి ఓక్లాలోని గదిలో క్వారంటైన్‌లో ఉంటున్న సెక్యూరిటీ గార్డుకు ఏప్రిల్ 11న పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. అతని ద్వారా ఆ కుటుంబానికి కరోనా సోకలేదని నిర్ధారణ అయింది. దీనిపై సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ.. "ఇప్పటివరకు నేనెప్పుడూ నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లలేదు, వెళ్లను కూడా. కేవలం నాకు దగ్గరలో ఉన్న మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేసుకుంటాను. నేను మీకు అబద్ధం చెప్పను" అని పేర్కొన్నాడు. (పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా)