శబరిమల కేసు: విస్తృత ధర్మాసనానికి బదిలీ

SC Refers Sabarimala Temple Issue Sent To Larger Bench - Sakshi

న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. తీర్పును వెలువరిస్తున్న సమయంలో సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘మతమంటే ఏంటి? మత విశ్వాసాలు ఏమున్నాయి? అనే అంశంపై చర్చ జరపాలని పిటిషనర్లు మమ్మల్ని కోరారు. నిజానికి ప్రతీ ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంది. ప్రార్థన చేసుకునే హక్కుకు లింగభేదం లేదు. అయితే ఈ కేసు కేవలం ఒక్క శబరిమల ఆలయానికే పరిమితం కాదు. మసీదులో ముస్లిం మహిళలు, బోరాలో పార్శీ మహిళల ప్రవేశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఈ కేసులో దాఖలైన 65 పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.

కాగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబరులో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు హిందూ సంఘాలు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 65 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో రివ్యూ పిటిషన్లను సీజేఐ జస్టిస్ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ నారీమన్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ ఖన్విల్కర్‌, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును ఎటూ తేల్చని ఐదుగురు జడ్జీల బెంచ్‌ దీనిని ఏడుగురు జడ్జీలున్న రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని జస్టిస్‌ నారీమన్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వ్యతిరేకించగా.. మెజారిటీ జడ్జీల నిర్ణయం మేరకు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.(చదవండి : ‘ఆ తీర్పును పక్కనపెట్టాలి’)

మరోవైపు.. సున్నిత అంశమైన ఈ కేసులో తీర్పు వెలువడుతుండటంతో శబరిమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నెల 16 శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకోనుండటంతో అక్కడ ఏకంగా 10 వేల మందితో భద్రత ఏర్పాటు చేశారు. కాగా గతంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 2న శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top