
సాక్షి, న్యూఢిల్లీ: శబరిమల ఆలయ కేసును రాజ్యంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు ఇచ్చింది. శబరిమల ఆలయ నిబంధనల ప్రకారం 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు ఆలయ ప్రవేశం లేదు. ఇది మహిళా హక్కులను హరించడమే కాకుండా లింగవివక్షకు తావిస్తుందని ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అనే స్వచ్ఛంధ సంస్థ సుప్రీం కోర్టులో ప్రజావ్యాజ్యం ధాఖలు చేసింది.
ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఈ కేసును ఐదుగురి జడ్జీలతో కూడిన ధర్మసనానికి బదిలీ చేసింది. అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలను ప్రవేశించకుండా నిర్ణయం తీసుకున్న ఆలయ కమిటి నిర్ణయం సరైనదా, కాదా అనే విషయం క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఉందని త్రిసభ్య బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక కేరళలోని ఎల్‌ఢీఎఫ్ ప్రభుత్వం శబరిమల ఆలయంలోకి మహిళల అనమతికి మద్దతిస్తుండగా.. గత యూడీఎప్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తోంది.