బాయ్స్‌ లాకర్‌ రూం: హైకోర్టు సీజేకు లాయర్‌ లేఖ

SC Lawyer Letter To Delhi HC Chief Justice Over Bois Locker Room Issue - Sakshi

బాయ్స్‌ లాకర్‌ రూం: సుమోటోగా స్వీకరించండి

న్యూఢిల్లీ: మహిళలు, బాలికల అశ్లీల ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ‘బాయ్స్‌ లాకర్‌ రూం’ గ్రూప్ సభ్యులపై సుమోటో యాక్షన్‌ తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాది నీలా గోఖలే ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌కు లేఖ రాశారు. అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడాలంటూ అశ్లీల సంభాషణకు తెరతీసిన పాఠశాల విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోక్సో, ఐటీ చట్టం, ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని మే 4న రాసిన లేఖలో పేర్కొన్నారు. కోవిడ్‌ మహమ్మారి కట్టడి చర్యల్లో ఢిల్లీ పోలీసులు, పాలనా యంత్రాంగం నిమగ్నమై ఉన్నదని.. బాయ్స్‌ లాకర్‌ రూం సభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. (బాలుడి ఆత్మహత్య.. ఢిల్లీలో కలకలం)

‘‘ఢిల్లీకి చెందిన కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను లైంగికంగా వేధించడం, వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడటం వంటి విషయాల గురించి సోషల్‌ మీడియాలో చర్చించారు. వీరిలో మైనర్లు కూడా ఉన్నారు. అనుచిత ప్రవర్తన తీవ్రత దృష్ట్యా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. వారి అశ్లీల సంభాషణ ఇప్పుడు పబ్లిక్‌ డొమైన్‌లో ఉండటం షాకింగ్‌గా ఉంది. మహిళల ప్రైవేటు భాగాల గురించి, లైంగిక హింస వారు విపరీత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు నగ్న చిత్రాలు వైరల్‌ చేస్తామంటూ మహిళలను బెదిరింపులకు గురిచేశారు.

ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోండి’’అని నీలా గోఖలే లేఖలో పేర్కొన్నారు. కాగా బాయ్స్‌ లాకర్‌ రూం పేరిట ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూప్‌చాట్‌లో మహిళలు, బాలికలను లైంగిక వేధింపులకు గురిచేస్తూ కొంతమంది విద్యార్థులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో.. ఈ విషయాన్ని గుర్తించిన ఓ బాలిక వీరి వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. దీంతో ఢిల్లీ సైబర్‌ క్రైం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  (పోలీసుల అదుపులో ‘బాయ్స్‌ లాకర్‌ రూం’ సభ్యుడు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top