బాలుడి ఆత్మహత్య.. ఢిల్లీలో కలకలం

Named in MeToo Post, Gurugram Boy Ends Life Self - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ‘బాయ్స్‌ లాకర్‌ రూం’ వివాదం నేపథ్యంలో 14 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. గురుగ్రామ్‌లోని విలాసవంత ప్రాంతమైన డీఎల్‌ఎఫ్ ఫేజ్‌ 5లో ఈ ఘటన జరిగింది. డీఎల్‌ఎఫ్‌ కార్ల్‌టన్‌ ఎస్టేట్‌ అపార్ట్‌మెంట్‌లోని 11వ అంతస్థు నుంచి దూకి అతడు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మహిళలు, బాలికలను లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఇన్‌స్టాగ్రామ్ ‘బాయ్స్‌ లాకర్‌ రూం’ గ్రూప్‌తో అతడికి ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఎటువంటి సూసైడ్‌ నోట్‌ దొరకలేదని, అతడి ఫోన్‌లోని సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు అధి​కారి ఒకరు తెలిపారు. మృతుడి ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు వెల్లడించారు. బాయ్స్‌ లాకర్‌ రూం (BoysLockerRoom) వ్యవహారంలో పోలీసులు ప్రశ్నిస్తారని తోటి విద్యార్థులు భయపెట్టడంతో సదరు బాలుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుడి సోషల్ మీడియా ఖాతాలను సైబర్ క్రైమ్ సెల్ జల్లెడ పడుతోంది. 

బాలుడి ఆత్మహత్యపై ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 174 కింద కేసు విచారణ ప్రారంభించారు. శవపరీక్ష నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణుడు దీపక్ మాథుర్ మాట్లాడుతూ.. ‘తలకు గాయం సహా పలు గాయాలు ఉన్నాయి. ఇది మరణానికి కారణమైంద’ని వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి సహ విద్యార్థులతో పాటు ‘బాయ్స్‌ లాకర్‌ రూం’ వేధింపులను వెలుగులోకి తెచ్చిన బాలికను ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. 

పోలీసుల అదుపులో ‘బాయ్స్‌ లాకర్‌ రూం’ సభ్యుడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top