
రాహుల్‌గాంధీకి ఊరట!
పౌరసత్వ వివాదంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
న్యూఢిల్లీ: పౌరసత్వ వివాదంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బ్రిటన్‌లోని కంపెనీ లా అధికారుల ముందు తాను ఆ దేశ పౌరుడిగా రాహుల్‌గాంధీ పేర్కొన్నారని, ఆయన పౌరసత్వ వివాదంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిపై సోమవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ అమితావ్ రాయ్ ధర్మాసనం ఈ పిల్‌ను కొట్టివేసింది. రాహుల్ బ్రిటన్ పౌరసత్వంపై పిల్‌తోపాటు జతచేసిన పత్రం ప్రామాణికతను ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ వ్యవహారంలో తాము తిరుగుతూ విచారణ జరపాలా? అని పిటిషనర్‌ను కోర్టు నిలదీసింది. ఇది అల్పమైన పిటిషన్ అని పేర్కొంటూ కొట్టివేసింది. రాహుల్ పౌరసత్వ వివాదంపై అత్యవసరంగా విచారణ జరపులంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ గతంలో చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఓ కార్పొరేట్ సంస్థకు సంబంధించి తాను బ్రిటన్ జాతీయుడినని రాహుల్ ఆ దేశ అధికారుల ముందు చెప్పినట్టు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే.