సెక్షన్‌ 497 కొనసాగించాలని కేంద్రం అఫిడవిట్‌

Sanctity Of Marriage Will Be Impacted Centre On Scrapping Section 497 - Sakshi

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : వివాహేతర సంబంధాల్లో పురుషుడితో సమానంగా స్త్రీని కూడా శిక్షించాలన్న వాదనను కేంద్రం వ్యతిరేకించింది. ఇలాంటి వ్యవహారాల్లో పురుషుడిని ఖైదు చేసే భారతీయ శిక్షా స్మృతి - సెక్షన్‌ 497ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. పురుషుడిని మాత్రమే దోషిగా గుర్తిస్తున్న ఈ సెక్షన్‌ను తొలగించాలని కేరళకు చెందిన జోసెఫ్‌ షైన్‌ గతేడాది డిసెంబర్‌లో అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సెక్షన్‌ 497ను తొలగిస్తే దేశంలో కల్లోలం జరుగుతుందని అభిప్రాయపడింది. వివాహం అనే పవిత్ర బంధానికి అర్థం లేకుండా పోతుందని పేర్కొంది. సెక్షన్‌ను కొనసాగించడం ద్వారానైనా హద్దులు మరచి ప్రవర్తించే కొంతమందినైనా అడ్డుకోవచ్చని తెలిపింది.

ఆందోళన కలిగిస్తున్న సంఘటనలు
వివాహేతర సంబంధాలు దేశవ్యాప్తంగా ఎన్నో కాపురాలను నిట్టనిలువునా కూల్చుతున్నాయి. అక్రమ సంబంధాలతో కుటుంబ వ్యవస్థ కుప్పకూలుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తను భార్యలు హతమార్చారు. వీటితో కలత చెందిన ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకూమారి పురుషులకు ఓ కమిషన్‌ ఉండాలని వ్యాఖ్యానించారు.

పిటిషనర్‌ ఏం కోరారు?
సెక్షన్‌ 497 పురుషులతో పోల్చుతూ మహిళలపై వివక్షతను చూపుతోందని పిటిషనర్‌ తన వాదన వినిపించారు. ‘ఒక రిలేషన్‌షిప్‌లో కేవలం పురుషుడు మాత్రమే ఆకర్షిస్తాడా?. ఓ మహిళ వేరే పురుషుడితో వివాహేతర సంబంధం నెరపడానికి అనర్హురాలా?. వేరొకరి భార్యతో సంబంధం కలిగివున్న పురుషుడికి మాత్రమే జైలు శిక్ష ఎలా వేస్తారు?(మహిళకు కూడా శిక్ష విధించాలని కోరుతూ). భర్త అంగీకారంతో భార్య వేరొకరితో సంబంధం కలిగివుంటే అతన్ని శిక్షించకుండా వదిలేయాలా?.’ వంటి ప్రశ్నలను పిటిషనర్‌ కోర్టు ముందు ఉంచారు.

డిసెంబర్‌లో వీటిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎమ్‌ ఖన్వీల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల నేతృత్వంలోని బెంచ్‌ ఇందుకు ప్రతిగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఒక మహిళను పురుషుడితో సమానంగా సెక్షన్‌ 497 చూడటం లేదని ప్రాథమికంగా నిర్ధారిస్తున్నట్లు బెంచ్‌ పేర్కొంది. మహిళను పురుషుడి కంటే తక్కువగా చూడటం సమాజానికి అలవాటైందని వ్యాఖ్యానించింది. అయితే, చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రానికి సెక్షన్‌ 497 కాన్సెప్ట్‌ ఇందుకు విరుద్ధంగా ఉందని చెప్పింది. భర్త అంగీకారం ఉంటే భార్య వేరొకరితో సంబంధం కలిగివుండొచ్చనే భావన మహిళ ఉనికిని ప్రశ్నించే విధంగా ఉందని అభిప్రాయపడింది.

సెక్షన్‌ 497 ఏం చెబుతోంది?
వేరొకరి భార్యతో వివాహేతర సంబంధం కలిగివుండటాన్ని ఐపీసీ సెక్షన్‌ 497 నేరంగా పరిగణిస్తోంది. ఇందులో మహిళ ప్రోద్భలం ఉన్నా, కేవలం పురుషుడికి మాత్రమే శిక్ష విధించాలనే నిబంధన ఉంది. అంతేకాకుండా వివాహేతర సంబంధం కలిగివున్న మహిళ అన్ని సందర్భాల్లో కేవలం బాధితురాలిగా మాత్రమే పరిగణించబడుతోంది. సంబంధం కలిగివున్న పురుషుడికి గరిష్టంగా ఐదేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top