యుద్ధక్షేత్రంగా శబరిమల

Sabarimala temple opens amid protests, women's entry stalled - Sakshi

మాసపూజల కోసం తెరచుకున్న ఆలయం

గుడి పరిసరాల్లోకి కూడా రాలేకపోయిన నిషేధిత వయసు అమ్మాయిలు, మహిళలు

ఆలయానికి వెళ్లేందుకు వచ్చిన స్త్రీలను అడ్డుకున్న ఆందోళనకారులు

ఆందోళనలు హింసాత్మకం.. పోలీసులపైకి రాళ్లు విసిరిన నిరసనకారులు

నిలక్కళ్‌/పత్తనంతిట్ట/పంబ: సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో గత కొన్నిరోజులుగా ఉధృతమైన నిరసనలు జరుగుతుండగానే శబరిమల ఆలయం ఐదు రోజుల మాస పూజల కోసం బుధవారం తెరచుకుంది. కొండ దిగువ ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనలు, హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో నిషేధిత వయస్సుల్లోని మహిళలెవ్వరూ పవిత్ర ఆలయ పరిసరాల్లోకి చేరుకోలేకపోయారు. 10 ఏళ్లలోపు, 50 ఏళ్ల పైబడిన వయసున్న బాలికలు, వృద్ధురాళ్లు అతి తక్కువ సంఖ్యలోనే అయ్యప్ప స్వామి గుడికి వెళ్లారు. రుతుస్రావం అయ్యే వయస్సుల్లో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం ఉండగా, ఆ నిషేధాన్ని గత నెల 28న ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. కాగా, బుధవారం సాయంత్రం ఆలయ ప్రధాన పూజారులు ఉన్నిక్రిష్ణన్‌ నంబూద్రి, కందారు రాజీవారులు గర్భగుడిని తెరిచి దీపం వెలిగించారు. సంప్రదాయం ప్రకారం తొలిరోజు ఆలయంలో పూజ నిర్వహించకుండా రాత్రి 10.30 గంటలకు తలుపులు మూసేస్తారు.
 

ఉద్రిక్తంగానే కొండ పరిసరాలు
శబరిమల కొండ పరిసరాల్లో బుధవారం మహిళలు సహా అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో కొండకు వెళ్లే దారులకు చేరుకుని, నిషేధిత వయస్సు అమ్మాయిలు, స్త్రీలను ఆలయానికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. వాహనాలు, బస్సులను తనిఖీ చేసి వారిని దించేశారు. విధులపై శబరిమలకు వెళ్తున్న పలు వార్తా చానళ్ల మహిళా పాత్రికేయులనూ నిరసనకారులు బెదిరించి, వారి వాహనాలను ధ్వంసం చేశారు. మరోవైపు స్త్రీలను అడ్డుకునే వారిని నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం ఆలయానికి వెళ్లే దారుల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది. నిరసనలకు నేతృత్వం వహిస్తున్న అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్‌ ఈశ్వర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిలక్కళ్, పంబల్లో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయి. రిపోర్టర్లు, ఫొటో జర్నలిస్టులు కలిపి 10 మంది మీడియా వ్యక్తులకు గాయాలయ్యాయనీ, వారి పరికరాలు ధ్వంసమయ్యాయని మంత్రి జయరంజన్‌ చెప్పారు. పంబ, నిలక్కళ్‌లలో 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు పాతనంతిట్ట జిల్లా యంత్రాంగం ప్రకటించింది.

కాంగ్రెస్, బీజేపీ మద్దతు..
ఆందోళనకారులకు కేరళలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు బీజేపీ తమ మద్దతు ప్రకటించింది. పోలీసుల లాఠీ చార్జీకి నిరసనగా శబరిమల యాక్షన్‌ కౌన్సిల్‌ ఇచ్చిన 12 గంటల బంద్‌ పిలుపునకు బీజేపీ, ఇతర ఎన్డీయే పార్టీలు మద్దతు తెలిపాయి. బీజేపీ ఎంపీ మురళీధరన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తన మొండిపట్టును వదిలి ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ ఈ అంశాన్ని హిందూ పునరుజ్జీవనం, హిందూ ఛాందసవాదాలకు మధ్య జరుగుతున్న పోరాటంగా చూడాలన్నారు. ప్రజలు చట్టం పక్షాన నిలిచి, చట్టం ముందు అందరూ సమానులన్న నియమాన్ని పాటించాలని కోరారు. కాగా, ఆలయానికి వస్తున్న మహిళలకు సరైన భద్రత కల్పించాల్సిదిగా జాతీయ మహిళా కమిషన్‌ కేరళ పోలీసులను కోరింది.

పోలీసుల రక్షణలో వెనుదిరిగిన ఏపీ మహిళ
శబరిమలకు వెళ్లేందుకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాధవి (45) అనే మహిళ ప్రయత్నించారు. బుధవారం ఉదయం ఆమె తన కుటుంబంతో కలసి స్వామి అయ్యప్ప మార్గం గుండా కొండ ఎక్కేందుకు యత్నించారు. మధ్యలో అయ్యప్ప భక్తులు ఆమెను అడ్డుకుని వెనక్కు వెళ్లిపొమ్మన్నారు. అయినప్పటికీ పోలీసుల రక్షణ మధ్య మరికొంత దూరం కొండ ఎక్కిన అనంతరం ఆమె పంబకు తిరిగొచ్చారు. పంబకు చేరుకునే వరకు పోలీసులు ఆమెకు రక్షణగా ఉన్నారు. మాధవి ఆలయానికి వెళ్లి ఉంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గుడిలోపలికెళ్లిన తొలి మహిళగా ఆమె నిలిచేవారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top